పుస్తకాలు, బెల్ట్ పై పార్టీ రంగులు! గుండు పిన్నును వదలరా అంటూ సెటైర్లు
posted on Oct 12, 2020 @ 4:04PM
ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసేది అదే. అది వాళ్ల బాధ్యత కూడా. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం.. బాగా అతి చేస్తోంది. ప్రభుత్వంగా చేయాల్సిన చిన్న చిన్న పనులను కూడా గొప్పగా చెప్పుకుంటోంది. అంతటితో ఆగకుండా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు అందించే ప్రతి వస్తువుపైనా పేర్లు ముద్రించుకుంటూ చీఫ్ పబ్లిసిటీ చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
జగనన్న విద్యాకానుకతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. వందల కోట్ల రూపాయలతో జాతీయ మీడియా ఛానెళ్లలోనూ ప్రకటనలు ఇచ్చింది. అయితే జగనన్న విద్యాకానుకలో అందించిన వస్తువులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు అందించిన వివిధ రకాల వస్తువులపై వైసీపీ జెండాను పోలిన రంగులను ముద్రించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.
విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌పై జగనన్న విద్యాకానుక అని ముద్రించారు. బెల్ట్ ను కూడా వదలకుండా పార్టీ జెండా రంగులు ముద్రించారు. పుస్తకాల్లోనూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సిలబస్ పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వస్తున్నాయి. గుండు పిన్నును కూడా వదలవా ముఖ్యమంత్రి జగన్ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు
జగనన్న విద్యాకానుక పథకంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రన్న కానుక , చంద్రన్న తోఫా అంటూ తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పేరు మార్చి జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. అయినా విద్యార్థులకిచ్చే పుస్తకాలు, బెల్టులపై పార్టీ జెండా రంగులు ముద్రించడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తమ హయాంలో చాలా పథకాలు అమలు చేశాం.. కాని ఏనాడు ఇలాంటి చిల్లర పనులు చేయలేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇలాగే ఆలోచిస్తే రాష్ట్రంతా ఎల్లో రంగులోనే కనిపించేదంటున్నారు టీడీపీ నేతలు. విద్యార్థులకు ఇచ్చిన వస్తువులపైనా పార్టీ జెండా రంగులు వేయడంపై ఇతర విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలే వైఎస్సార్ జలకళ పేరుతో కొత్త స్కీం తెచ్చారు. ఇందు కోసం బోరు బండ్లను కొనుగోలు చేశారు. ఆ లారీలకు కూడా వైఎస్సార్ పార్టీ జెండా పోలేలా కలర్స్ వేశారు. దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రంగుల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టింది. గ్రామ సచివాలయాలకు మొత్తం పార్టీ జెండా రంగులు వేశారు. ఇందు కోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. సచివాలయాలకు వెసిన రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. జగన్ సర్కార్ నిర్ణయం వల్ల రంగులు వేయడానికి ..మళ్లీ తొలగించడానికి.. తిరిగి కొత్త రంగులు వేయడానికి నాలుగు, ఐదు వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతున్నారు.
ప్రభుత్వానికి పాలనపై దృష్టి ఉండాలి కాని రంగులపై ఏంటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. అన్ని పథకాలకు ఇలా రంగులు వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మంచివైతే .. అవే ప్రజల్లోకి వెళతాయని.. వాటి కోసం ప్రత్యేకంగా ఇలా పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.