మిత్ర పక్షానికి మమత షాక్.. సోనియా ప్రయత్నాలు ఫలించేనా?
posted on Aug 21, 2021 @ 8:29PM
కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షాల ఐక్యత కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజుల క్రితం, ఆగష్టు 19 న రాజీవ్ గాంధీ జయంతి రోజున, ఆమె 19 పార్టీల నాయకులతో ఐక్యత సమావేశం నిర్వహించారు.వర్చువల్’గా సమావేశంలో తృణమూల్ సహా 19 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆమె, మనందరి లక్ష్యం 2024 సార్వత్రిక ఎన్నికలే కావాలని పిలుపు నిచ్చారు. అందుకోసంగా ప్రణాళికగా బద్దంగా పని చేయాలని, అన్నారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, స్టాలిన్, ఇంకా మరి కొందరు కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.అందరి లక్ష్యం ఒక్కటే, మోడీని ఓడించడమే కావాలని తీర్మానించారు.
అయితే, ఓవంక విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే, కూటమి నాయకత్వం కోసం, తృణమూల్ కాంగ్రెస్’ తో పోటీ పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు, పార్టీకి గుడ్ బై చెప్పి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం క్రితం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా కాంగ్రెస్’ను వదిలి మమతా దీదీ గూటికి చేరారు.తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు తాజాగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, త్రిపుర పీసీసీ అధ్యక్షుడు పీజూష్ కాంతి బిస్వాస్, పీసీసీ అధ్యక్ష పదవికి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన అదే ట్వీట్ ’లో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో సుస్మితా దేవ్’కు సన్నిహితంగా ఉండే పీజూష్, కూడా ఆమె బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరతారని స్థానిక మీడియాలో వర్గాలు పేర్కొంటున్నాయి.
పీజూష్ పార్టీని వదిలి పోవడంతో, ఈశాన్య రాష్టాలలో అసలే అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీ మరింతగా కుదేలవుతుందని, విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవ సారి ఓడి పోయింది. అలాగే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, లెఫ్ట్ ఫ్రంట్ ‘తో జట్టు కట్టినా ఫలితం లేక పోయింది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. నిజానికి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా,ఈశాన్య రాష్ట్రాలలో కమల దళానికి ఉనికే లేదు.కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్ పార్టీలదే పై చేయిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ను ఓడించి అస్సాంలో, సీపీఎం గద్దె దించి త్రిపురలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మెల్లమెల్లగా ఈశాన్య బారత దేశంలో గట్టిగానే జెండా పాటింది. అస్సాం, త్రిపురతో సహా వచ్చే సంవత్సరం (2022) ఎన్నికలు జరిగే మణిపూర్’లోనూ ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. మరో వంక, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉనికిని కోల్పోయిన్ నేపధ్యంలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ దూసుకోస్తోంది.
అందుకే కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు తృణమూల్ గూటికి చేరుతున్నారని రాజేకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులూ క్యూ కట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జాతీయ స్థాయిలో జరుగతున్న విపక్షాల ఐక్యతా యత్నాలఫై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది, ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.