తెలంగాణలో త్రిముఖ పోరు.. పై ‘చేయి’ ఎవరిది?
posted on Apr 13, 2024 @ 12:56PM
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో త్రిముఖ పోరు తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి ముందు వరకూ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో ఏ మేరకు పోటీ ఇస్తుందన్న అనుమానాలు రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతున్నాయి. అసలే ఓటమి భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ పార్టీ భారీ వలసలతో చిక్కి శల్యమైన పరిస్థితి ఉంది.
గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39 శాతం ఓట్లు సంపాదించుకోగా, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ 37 శాతం ఓట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన ఓటు శాతాన్ని ఏకంగా 14 శాతం పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సంపాదించుకున్న బి.ఆర్.ఎస్ పార్టీ దాదాపు 10 శాతం ఓట్లు కోల్పోయింది. అయితే బి.ఆర్.ఎస్ ఓట్లలో అత్యధిక భాగం బీజేపీ, కాంగ్రెస్‌లకు వెళ్లిపోయినట్టు అర్థమవుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో చాలా భాగం ఓట్లను బీజేపీ చేజిక్కించుకోగా, ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది.
బీఆర్ఎస్ ఓటమి తరువాత కె.సి.ఆర్ కు అత్యంత సన్నిహితులు, సలహాదార్లుగా గుర్తింపు పొందిన కడియం శ్రీహరి, కె. కేశవరావు వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సహజంగానే బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 9 సీట్లను, 42 శాతం ఓట్ల వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్న బి.ఆర్.ఎస్ లక్ష్యం నెరవేరే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. 2018 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ గత శాసనసభ ఎన్నికల్లో 14 శాతం ఓట్లను సాధించింది. అంటే, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలకు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురౌకావడం ఖాయం అని చెప్పవచ్చు. దీనిని బట్టే తెలంగాణలో లోక్ సభ ఎన్ని కల్లో త్రిముఖ పోటీ అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ ఒవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్ లోక్‌సభ స్థానం మినహా రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో ఆయన మద్దతుదార్లు ఎవరికి ఓటు వేస్తారన్నది కూడా కీలకమైన అంశమే.
బీఆర్ఎస్ అధకారంలో ఉన్నంత కాలం ఎంఐఎం ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరించింది. అయితే బీఆర్ఎస్ అధికారానికి దూరమైన తరువాత ఎంఐఎం కాంగ్రెస్ కు చేరువ అయినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం పట్టు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అన్నదానితో సంబంధం లేకుండా నిలుపుకోలదు. దీంతో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి మిగిలిన 17 లోక్ సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగే ముక్కోణపు పోటీలో ఎవరు పై ‘చేయి’ సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.