4న భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్
posted on Dec 31, 2025 @ 9:33AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబౌతోంది. విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ట్రయల్ రన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు అధికారులు. వచ్చే నెల 4న తేదీన భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ లో భాగంగా తొలి విమానం ల్యాండ్ కానుంది. ఫైనల్ టెస్ట్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంతో జరగడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి చొరవే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణ పనులు95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే జనవరి 4న జరిగే ఫైనల్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఆ తరువాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇతర విమానయాన సంస్థలతో చర్చలు జరిపి.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే తేదీని ఖరారు చేస్తారు.