విజయదశమి రోజున విషాదం.. మధ్యప్రదేశ్ లో 11 మంది మృతి

విజయదశమి పర్వదినం రోజున మధ్య ప్రదేశ్ లో మహా విషాదం సంభవించింది. శరన్నవరాత్రులలో భక్తి శక్తలతో పూజలు చేసి విజయదశమి రోజున అమ్మవారి విగ్రహ నిమజ్జనం సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖండ్వా జిల్లా జమ్లి గ్రామంలో భక్తులు దుర్గామాత విగ్రహాన్ని ట్రాక్టర్-ట్రాలీపై  నిమజ్జనం కోసం తీసుకు వెడుతుండగా,  ఓ   కల్వర్టును దాటుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మృతులలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో మరి కొందరు గల్లంతయ్యారు. వారి కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.   

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి తాజా రాజకీయ పరిణామలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను చంద్రబాబు, అమిత్ షాకి వివరించారు.  కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి  హర్దీప్ ఎస్ పూరీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రూ. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటి అయిన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి సమావేశం  అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను ఆయన కు వివరించారు. సవరించిన డీపీఆర్ లను ఆమోదించాలని కోరారు. 

భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు

  రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 89 ఏళ్ల వయసులోనూ తన జీవిత సహచరిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ రైతు తన భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన దృశ్యాన్ని  చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. కళ్లెం నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు... వీరు చిలుకూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు.  గత సంవత్సరం క్రితం భార్య లక్ష్మి మరణించింది. దీంతో భార్య లక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కళ్లెం నర్సింహా రెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతుళ్లు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ఆమె పక్కనే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో వ్యవసాయం చేస్తూ ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అమలు చేసిన నర్సింహా రెడ్డి, ఆ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందు కున్నారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చిలుకూరులో స్థిరపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న భార్య లక్ష్మీ మరణించడంతో నర్సింహా రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆమె జ్ఞాపకాలను మరచి పోకుండా ఉండేందుకు, జీవితాంతం తనతోనే ఆమె ఉంటుందనే భావనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “ఆమె ఒంటరిగా ఉండ కూడదు… నేను ఆమెకు తోడుగా ఉంటాను” అన్న భావంతోనే భార్య పక్కనే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. జీవిత భాగస్వామి పై నిస్వార్థమైన అనురా గాన్ని చూపిస్తున్న రైతును చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.చిలుకూరులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

  తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A29 టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం 2017–18 మరియు 2020 నుంచి 2023 వరకు టిటిడి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పీపీ వివరించారు. డెయిరీ ప్లాంట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు ఇచ్చి, అర్హత లేని సంస్థలైన భోలేబాబా డైరీ, వైష్ణవీ డైరీ, మలగంగా మిల్క్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి తిరుమలకు నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్టు వాదించారు. దీనికి ప్రతిఫలంగా నిందితుడు సుబ్రహ్మణ్యం వెండి ప్లేట్లు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.50 లక్షల లంచం తీసుకున్నట్టు సిట్ గుర్తించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, అప్పన్నతో కలిసి కుట్ర చేసిన తీరును స్పష్టంగా చూపించే సాక్ష్యాలు ఉన్నాయని పీపీ జయశేఖర్ తెలిపారు. అలాగే వైవి సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఒత్తిడితోనే సుబ్రహ్మణ్యం ఈ అక్రమాలకు పాల్పడ్డాడని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి, నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ సుబ్రహ్మణ్యం బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు.  

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

  ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతు ఇప్పటివరకు 74 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.   అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు డిప్యూటీ సీఎం  అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను విని వాటికి పరిష్కారం చూపే ఈ ప్రజావాణి కార్యక్రమం నిజమైన ప్రజా పరిపాలనకు ప్రతిరూపమని ఆయన అన్నారు. దేశంలో ఇంత సమర్థంగా ప్రజా గోడు విని పరిష్కరిస్తున్న కార్యక్రమం ఎక్కడా లేదని పేర్కొన్నారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా ప్రజావాణి కొనసాగుతుంది. ప్రజల మేలు కోసం రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ పనిచేయడం మా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల తమ అనుభవాల పంచుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్... మరో సిట్ ఏర్పాటు

  తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన 21 నెలల తర్వాత.. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. దీంతో.. ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఐదుగురు ఐపీఎస్‌లు సహా తొమ్మిది మంది పోలీసు అధికారులతో.. డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. గతంలో డిపార్ట్మెంట్ పరంగా సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వపరంగా సిట్ ఏర్పాటు అయింది.  మొన్నటిదాకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే.. మరోసారి సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. వారితో పాటు వందల మంది సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో జరగబోయే దర్యాప్తులో.. ఇంకా ఎవరు బయటికొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అధికారులు దర్యాప్తు చేసినా.. ఇన్వెస్టిగేషన్‌ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశముంది.  ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహకరించారనే ఆరోపణలతో.. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్‌ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారణలోనే.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి.. 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో.. రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి భారతదేశానికి రప్పించారు.  వారిని రప్పించినా.. ఎస్‌ఐబీలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. సిట్ విచారణలో.. కీలక నిందితుడు ప్రభాకర్ రావు నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిపింది. అధికారుల ఆదేశాలతో.. అంతా రూల్స్ ప్రకారమే చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రభాకర్ రావు స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానమిచ్చారు. హార్డ్‌ డిస్కుల ధ్వంసం కూడా నిబంధనల ప్రకారమే చేశానన్నారు. ఈ-మెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందని తెలిపారు.  ట్యాపింగ్ డివైజ్‌లు అమెరికాలోనే మరిచిపోయానని తెలిపారు. కానీ.. అసలు సూత్రధారులపై సమాచారం ఇవ్వలేదు. దాంతో.. దర్యాప్తు ముందుకు కదల్లేదు. పైగా.. ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో చెప్పిన ఉన్నతాధికారులను విచారించేందుకు అవాంతరాలు ఎదురవడంతో.. ఈ కేసు విచారిస్తున్న సిట్ టీమ్ ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. వారిని విచారిస్తే గానీ.. కేసు దర్యాప్తు కొలిక్కి రాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనుక.. అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతోనే ప్రభాకర్ రావు వాస్తవాలను చెప్పడం లేదని అనుమానిస్తున్నారు.  ఈ క్రమంలోనే.. మరింత లోతుగా విచారించేందుకు.. ఉన్నతాధికారులు, నాయకుల గుట్టు విప్పేందుకే.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. సిట్ దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన కస్టడీని డిసెంబర్ 25 దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు.  ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని.. ఇంకొన్ని రోజులు విచారణ జరిపేందుకు.. కస్టడీ పొడిగించాలని.. ప్రభుత్వం తరఫు లాయర్లు కోరారు. ఇందుకు ఏకీభవించిన ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని వారం పొడిగించింది. ఆ మరుసటి రోజే.. ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ సమయంలో.. తదుపరి విచారణ దాకా.. ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను.. జనవరి 16కు వాయిదా వేసింది. అయితే.. ఇన్నాళ్లూ తేల్చనిది.. ఈ నెల రోజుల్లో కొత్తగా గవర్నమెంట్ వేసిన సిట్ ఏం తేల్చబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్.. సెలబ్రిటీల ఆస్తులు అటాచ్

  ఇటీవల బెట్టింగ్ యాప్స్‌తో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇందుకోసం కొంతమంది సెలబ్రెటీలను ప్రమోషన్లకు వాడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రెటీలు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసిన వారిపై ఈడీ కొరడాఝులిపిస్తుంది.  ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. పీఎంఎల్ ఏ కేసులో ప్రముఖల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటికే నటులు సోనూసూద్‌, నేహాశర్మ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ, తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్ ఊతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులు సైతం అటాచ్ చేశారు. 

పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా...జగన్ బెదిరింపులపై పల్లా ఫైర్

  పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు  ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్  రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.  జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా  స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు.  అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.  అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా  మండిపడ్డారు.  రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా  తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.  జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని టీడీపీ చీఫ్ గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.

విదేశాల్లో ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోడీ, మాల్యాల రాజసం

  ఇండియా విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోడీ, విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి, లండన్‌లో లలిత్ మోడీ తన స్నేహితుడు విజయ్ మాల్యా 70వ పుట్టినరోజుకు ముందు నిర్వహించిన విలాసవంతమైన పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. భారతదేశంలో కోట్లాది రూపాయల కుంభకోణాలు, రుణ ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ విదేశాలలో బహిరంగంగా వేడుకలు జరుపుకుంటున్నారు. జనాన్ని నిండా ముంచి విదేశాల్లో వారు బహిరంగ పార్టీల్లో పాల్గొంటుండం హాట్ టాపిక్‌గా మారింది.   ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఈ ప్రీ-బర్త్‌డే పార్టీని లండన్‌లోని తన విలాసవంతమైన ఇంట్లో నిర్వహించారు. విజయ్ మాల్యా డిసెంబర్ 18, 1955న జన్మించారు. ఈ పార్టీ డిసెంబర్ 16న జరిగింది. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ జిమ్ రీడెల్ సోషల్ మీడియాలో విజయ్ మాల్యా పార్టీ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. లలిత్ మోడీ, విజయ్ మాల్యాల ఫోటోను పోస్ట్ చేశారు. లలిత్ తన అందమైన ఇంట్లో విజయ్ మాల్యా కోసం విలాసవంతమైన ప్రీ-70వ పుట్టినరోజు పార్టీని నిర్వహించారని రాశారు. ఈ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, లలిత్ మోడీ, “తన స్నేహితుడు విజయ్ మాల్యా పుట్టినరోజును జరుపుకోవడానికి తన ఇంటికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు” అని రాశారు.  ఆ తర్వాత విజయ్ మాల్యా ఆ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు ఇద్రిస్ ఎల్బా, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా కూడా ఈ పార్టీలో కనిపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కిరణ్ మజుందార్-షా కొన్నిసార్లు మనోవిరాజ్ ఖోస్లాతో నిలబడి, కొన్నిసార్లు ఇద్రిస్ ఎల్బాతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. జిమ్ రీడెల్ కూడా పార్టీ ఆహ్వాన కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రీమా, లలిత్ తమ ప్రియమైన స్నేహితుడు విజయ్ మాల్యా గౌరవార్థం ఒక ఆకర్షణీయమైన సాయంత్రం నిర్వహిస్తున్నారని కార్డులో పేర్కొన్నారు.  ఆ కార్డు విజయ్ మాల్యాను “మంచి కాలాల రాజు” అని పేర్కొంది. లలిత్ మోడీ, విజయ్ మాల్యా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 29న, లలిత్ మోడీ తన 63వ పుట్టినరోజును లండన్‌లో చాలా వైభవంగా జరుపుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ ప్రాంతంలోని ప్రసిద్ధ మాడాక్స్ క్లబ్‌లో ఈ పార్టీ జరిగింది. విజయ్ మాల్యా కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. ఆ సమయంలో లలిత్ మోడీ ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం

  అమెరికాకు వెళ్లాలని కలలు కనే కోట్లాది మంది విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారీ షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న 'గ్రీన్ కార్డ్ లాటరీ' (డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్)ను తక్షణమే నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇటీవల అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ప్రసిద్ధ 'బ్రౌన్ యూనివర్సిటీ'లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పోర్చుగీస్ జాతీయుడని దర్యాప్తులో తేలింది. అయితే ఆ నిందితుడు అసలు అమెరికాలోకి ఎలా ప్రవేశించాడనే కోణంలో విచారణ జరపగా.. అతను 'గ్రీన్ కార్డ్ లాటరీ' ద్వారానే దేశంలోకి అడుగు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు సులభంగా దేశంలోకి రావడానికి ఈ విధానం మార్గంగా మారుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ స్పందిస్తూ.. "మన దేశంలోకి ఇటువంటి దారుణమైన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను వెంటనే నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ను (USCIS) ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఇకపై డైవర్సిటీ వీసా కింద కొత్త దరఖాస్తులను స్వీకరించడం నిలిచిపోనుంది.  అమెరికాలోని వలస జనాభాలో వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ప్రతి ఏటా సుమారు 55,000 గ్రీన్ కార్డులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల పౌరులకు ఈ విధానం ద్వారా శాశ్వత నివాసం పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు భద్రతా కారణాలతో ఈ ప్రక్రియకు ట్రంప్ బ్రేక్ వేశారు.  ట్రంప్ మొదటి నుంచి అక్రమ వలసలపై కఠినంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు చట్టబద్ధంగా ఉండే లాటరీ విధానాన్ని కూడా రద్దు చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే మధ్య తరగతి ప్రజలకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.