రేపు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు
posted on Jan 12, 2024 @ 1:58PM
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ( జనవరి 13) ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన రేపు పూచీకత్తును సమర్పించనున్నారు. మరోవైపు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ కు కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేస్తున్నారు. జనసేనతో కలిసి పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబుకు బారీ ఊరట దక్కింది. చంద్రబాబు పైన ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చంద్రబాబు పైన సీఐడీ మరో మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఏ1గా చంద్రబాబును సీఐడీ పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలను నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రబుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది. వీటి పైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పైన కోర్టు తీర్పు వెలువరించింది.