రాజకీయాలలో టాలీవుడ్ కరివేపాకులు!
posted on Jul 17, 2023 @ 4:54PM
ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఫిల్మ్ గ్లామర్ ఒక అసెట్. అందులో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచీ సినీమా ప్రభావం చాలా చాలా ఎక్కువగానే ఉంది. కలావాచస్పతిగా గుర్తింపు పొందిన కొంగర జగ్గయ్య, డాక్టర్ ప్రభాకరరెడ్డి వంటి వారు ఇటు సినిమాలలోనూ.. అటు రాజకీయాలలోనూ రాణించారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత సినీ గ్లామర్ అనేది రాజకీయాలకు ఒక అదనపు హంగుగా ఇమిడిపోయింది. ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశంలో సినీ గ్లామర్ కు చంద్రబాబు నాయుడు కూడా సముచిత స్థానం ఇచ్చారు.
తమ ప్రచారం ద్వారా పార్టీకి అదనపు ఆదరణ కలిగేందుకు దోహదపడిన వారికి సముచిత పదవులు హోదా కల్పించి గౌరవంగా చూసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తరువాత కాంగ్రెస్ కూడా అనివార్యంగా సినీ స్టార్లకు పార్టీలో అవకాశం ఇచ్చింది. హీరో కృష్ణ వంటి వారు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా చట్ట సభలకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఆ పార్టీలో వారికి సరైన గుర్తింపు లేదన్న భావనతో క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తెలుగుదేశం మాత్రం సినీ పరిశ్రమ సేవలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా.. పార్టీకి సేవలందించిన వారికి సరైన ప్రాధాన్యత కూడా ఇచ్చి ప్రోత్సాహించింది. నటుడు మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యత్వం, ప్రస్తుత మంత్ర రోజాకు అప్పట్లో అంటే ఆమె తెలుగుదేశంలో ఉన్న సమయం తెలుగు మహిళా అధ్యక్షపదవిని కట్టబెట్టింది.
రాష్ట్ర విభజన తరువాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సినీ పరిశ్రమ సేవలను ఉపయోగించుకుంటూనే వచ్చింది. వస్తోంది. అదే కోవలో వైసీపీ కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకున్నప్పటికీ... వారి పట్ల యూజ్ అండ్ త్రో వైఖరినే అవలంబిస్తూ వస్తోందని పరిశీలకులు అంటున్నారు.
వైసీపీలో చేరిన నటులు జీవిత, రాజశేఖర్ వంటి వారు గుర్తింపు కరవై దూరమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. దర్శకులు ఎస్పీ కృష్ణారెడ్డి వైసీపీకి సేవలందించే ఉద్దేశంతో పార్టీలో చేరినప్పటికీ ఆయనను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఇక 2019 ఎన్నికల సమయంలో పార్టీ కోసం సినీ కెరీర్ ను కూడా ఫణంగా పెట్టి పని చేసిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, లవ్ యూ రాజా అనే ఊతపదంతో పాపులర్ అయిన సినీ రచయత నటుడు పోసాని కృష్ణ మురళి, కాట్రవల్లి అలీల పరిస్థితి అలాగే తయారైంది. వీరిలో తన స్థాయి మరచి విపక్షంపైనా మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్న ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ కు ముందుగా ఓ పదవి దక్కింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
వివాదంలో చిక్కుకున్న ఆయన పదవిని ఊడబెరికిన జగన్ ఆ తరువాత కనీసం పట్టించుకోలేదు. దీంతో తనేకు అంతో ఇంతో పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన సినీ పరిశ్రమకూ. రాజకీయాలకూ కూడా పనికిరాని పుష్పంగా మిగిలిపోయారు. ఇక పోసాని, అలీల విషయానికి వస్తే.. వైసీపీ విజయానికి కూలీలుగా పని చేసిన వీరిద్దరికీ పదవుల ఆశ చూపిన జగన్.. పార్టీ విజయం తరువాత పూర్తిగా విస్మరించారు. ముఖ్యంగా అలీ అయితే.. 2019 ఎన్నికలలో పోటీయే లక్ష్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. ఇందు కోసం ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలతో సంప్రదింపులు జరిపి చివరకు వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికలలో అలీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రాజ్యసభ సభ్యత్వం వంటి హామీలు లభించడంతో.. పోటీకి అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తిని మనసులోనే దిగమింగుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే.. చివరికి మూడు సంవత్సరాల తరువాత అలీకి దక్కింది ఓ సలహాదారు పదవి. పోసాని పరిస్ఠితీ అంతే. స్థాయికి తగ్గ పదవులు కాకున్నా అలీ, పోసాని కూడా మరో గత్యంతరం లేక ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా అలీ విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో స్టార్ కమేడియన్ గా ఆయన స్థాయే వేరు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని అలీ వైసీపీలో చేరడానికి ముందు వరకూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. వైపీసీలో చేరిన తరువాత అలీ పవన్ కల్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో అటు స్నేహానికీ దూరం కావడమే కాకుండా సినీ అవకాశాలు సైతం బాగా తగ్గిపోయాయి. వచ్చే ఎన్నికలలోనైనా పోటీకి జగన్ పార్టీ టికెట్ ఇస్తారా అంటే ఆ నమ్మకమూ లేదు. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఒక వేళ అవకాశం దక్కినా గెలుపుపై నమ్మకాలూ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో అలీ పరిస్థతి అగమ్య గోచరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగిన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. వైసీపీ కండువా కప్పుకున్న తరువాత ఆ పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. కరుణామయుడు సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయచందర్ వైసీపీలో చేరి ఎందుకూ కొరగాకుండా పోయారు. భానుచందర్, హాస్య నటుడు కృష్ణుడు ఎందరో అటు సినీమాలకు దూరమై, ఇటు రాజకీయంగానూ గుర్తింపునకు నోచుకోక అనామకంగా మిగిలిపోయారు. మధ్యలో హీరో నాగార్జున, నటి రాశి ముఖ్యమంత్రి జగన్ ను కల్సినప్పటికీ ఆ పార్టీలో చేరడానికి మాత్రం ముందుకు రాలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వైసీపీకి లేదని అర్ధమౌతున్నది. అలాగే వైసీపీకి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారిని యూజ్ అండ్ త్రో గా వాడుకుని వదిలేయడమే తప్ప వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది.