Read more!

మనస్సు స్వాధీనంలో ఉండటం ఎందుకు అవసరమో తెలుసా?

మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనసు నియంత్రణలో లేకపోతే ఏ పనినీ సంపూర్ణంగా చేయలేరు. అదే మనసు నియంత్రణలో ఉంటే గొప్ప కార్యాలను కూడా సులువుగా చేసే శక్తి వస్తుంది. 


మనస్సు స్వాధీనంలో లేనివాడు మనశ్శాంతిని పొందలేడు. మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు? బలమైన కోరికలు, ఉద్రేకాలు, ఒత్తిళ్ళతో బాధపడే వ్యక్తి దీర్ఘ మానసిక వ్యాధులకు గురవుతాడు. మనస్సు స్వాధీనమైతే కలిగే ఫలితమే.. సమగ్ర వ్యక్తిత్వ వికాసం. అలాంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులలో కూడా  విజయం సాధిస్తాడు. ప్రశాంతంగా ఉండేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాడు. సంతోషంగా ఉండేవారు చేపట్టిన పనిలో నాణ్యతను ప్రదర్శిస్తారు. అయితే, దీనికి అర్థం  అలాంటి వారి జీవితంలో ఎలాంటి చీకూచింతలూ ఉండవని కాదు. కానీ అలాంటి వారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. ఎదురైన కష్టాల్నీ, సమస్యల్నీ విజయానికి సోపానాలుగా మలచుకుంటాడు. వాటివల్ల జీవితంలో  మరింత గొప్పగా రాణించగలుగుతారు. అలాంటి వ్యక్తిని, వ్యక్తులను సమాజం ఒక ఆదర్శపురుషునిగా కొనియాడుతుంది.

ఇకపోతే.. 'ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు? అనే ప్రశ్న చాలామందిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మనస్సును ఎవరు జయిస్తారో వారే! ప్రపంచాన్ని జయించగల సామర్థ్యం కలిగి ఉంటారు. 

ప్రగతి, అభివృద్ధి, ప్రశాంతత వీటిని  ఏ రంగంలో  సాధించాలన్నా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని జాతి తన అభివృద్ధిని నిలుపుకోలేదు. మనిషి మనసును నియంత్రణలో పెట్టుకోవడం అనే గొప్ప స్థాయిని చేరగలడు. అందుకే మనిషి అన్ని జీవజాతులలోకి గొప్ప వాడిగా ఉండగలుగుతున్నాడు. 

అయితే మన ప్రగతికి అవసరమైనది బలమైన సంకల్పశక్తి కలిగి ఉండడమే. ఆ శక్తిని సాధించ లేకపోతే అధోగతి పాలవుతామన్న విషయాన్ని మన మనస్సుకు పదేపదే చెప్పాలి. మనస్సుని స్వాధీనపరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యం మీదే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. కనీస అవసరాలు తీరిన తరువాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా అనిపించే అవకాశం ఉంది. చాలామంది విషయంలో జరిగేది ఇదే. అవసరాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ పోతుంటాయి. అవసరం లేనివి కూడా అవసరమే ఉద్దేశ్యంలోకి జారుకుంటారు. కానీ జీవితపు సర్వోత్కృష్ట లక్ష్యమైన జ్ఞానోదయాన్నీ, దైవ సాక్షాత్కారాన్నీ పొందాలనుకుంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు.

ఒకసారి  ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుని, దృఢంగా నమ్మగలిగితే మనిషి సంకల్పశక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి ప్రశాంత మనసుతో ఏ కార్యాన్నైనా సాధించవచ్చు.


                                          *నిశ్శబ్ద.