ఎనిమిది నిండు ప్రాణాలు...
posted on Dec 30, 2014 8:54AM
మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది మంది మరణించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వాడపల్లికి చెందిన ఎం.డి. ఖలీం తన కుటుంబ సభ్యులతో కలసి కారులో నల్గొండ నుంచి వాడపల్లికి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖలీం (35), రిజ్వానా (30), సైదయ్య (38)తోపాటు మరో ఇద్దరు మరణించారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం యువజన కాలనీకి చెందిన రవి (18), నాగవేణి (35) మరణించారు. రవి అనే యువకుడు తన పిన్నితో కలసి దిచక్ర వాహనం మీద గుత్తిలోని ఓ దేవాలయానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి - దేవరకొండ రహదారి మీద కల్వర్టు వద్ద వరికోత యంత్రం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ వాహనం డ్రైవర్ రాము (30) వరికోత యంత్రంలో చిక్కుకున్నాడు. పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకుని రామును బయటకి తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.