30 ఇయర్స్ ఇండస్ట్రీ... ఇన్నాళ్ళకి వచ్చింది మినిస్ట్రీ!
posted on Jun 13, 2024 @ 11:42AM
పయ్యావుల కేశవ్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు. విషయ పరిజ్ణానం మెండుగా ఉన్న నేత. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పిలుపు మేరకు పయ్యావుల 1994లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ఆరంబించారు. 1994 ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి సారి విజయం సాధించారు.
అయితే అదే నియోజకవర్గం నుంచి 1999లో కూడా పోటీ చేసిన పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వరుసగా 2004, 2009 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ ఆ రెండు సార్లూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 2019 లో జరిగిన ఎన్నికలలో జగన్ వేవ్ లో కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే తాజా ఎన్నికలలో పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో పయ్యావుల కేశవ్ ఓడిపోతే తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అన్న అపప్రధ పూర్తిగా తొలిగిపోయింది.
1994 నుంచి ఇప్పటి వరకూ ఏడు సార్లు సాధారణ ఎన్నికలు జరగగా పయ్యావుల కేశవ్ ఐదు సార్లు విజయం సాధించారు. అయితే ఆయన విజయం సాధించిన సందర్భంలో తెలుగుదేశం విపక్షంలో ఉండటం, ఆయన పరాజయం పాలైన ప్రతిసారీ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఇంత కాలం ఒక రివాజుగా మారిపోయింది. ఈ సారి ఆ ఒరవడికి బ్రేక్ పడింది.
పార్టీ, పయ్యావులా ఇరువురూ గెలిచారు. అంతే కాదు చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు స్థానం దక్కింది. దీంతో పయ్యావుల మూడు దశాబ్దాల ఎదురు చూపులు ఫలించాయి. అంతే కాకుండా ఉరవకొండ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి కావడం అన్నది కూడా నాలుగు దశాబ్దాల తరువాత మొదటి సారిగా సంభవించింది. ఎప్పుడో 1985లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచి గుర్రం నారాయణప్ప మంత్రి అయ్యారు. ఆ తరువాత ఉరవకొండ నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్త పయ్యావుల కేశవ్.