భార్యను బాగా చిరాకు పెట్టే భర్త అలవాట్లు ఇవి.. రిపీట్ అయితే రిలేషన్ ఢమాల్..!
posted on Oct 17, 2025 @ 9:30AM
వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధం సంఘర్షణతో నిండి ఉంటుంది. విభిన్న వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం, పరిస్థితులకు అలవాటు పడటం అనేది చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇద్దరూ కలిసి అన్ని సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లడాన్నే ప్రేమ, అర్థవంతమైన బంధం అని అంటారు. కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య సంబంధాన్ని నాశనం చేసే విధంగా ఏదైనా మాట్లాడతాము. ముఖ్యంగా భర్త మాట్లాడే కొన్ని మాటలు, చేసే పనులు, అలవాట్లు భార్యను చాలా చిరాకు పెడతాయి. ఇవి పదే పదే రిపీట్ అయితే భార్యాభర్తల బంధం నిలబడదని, ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ భార్యను చిరాకు పెట్టే ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. పరిస్థితిని తెలివిగా చక్కబెట్టుకోవచ్చు.
పోలికలు ప్రధాన సమస్య..
తన భర్త తనను మరొక స్త్రీతో పోల్చినప్పుడు ఏ భార్య కూడా ఇష్టపడదు. కొన్నిసార్లు భర్త అనుకోకుండా భార్యను పోల్చడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భర్తలకు భార్యల నుండి ఎదురుదెబ్బ తగులుతుంది. ముఖ్యంగా బాగా చదువుకుని ఆర్థికంగా సంపాదిస్తూ, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే అమ్మాయిలు భర్త తనను ఇతర అమ్మాయిలతో పోల్చడాన్ని అస్సలు రిసీవ్ చేసుకోలేదు.
పదే పదే భార్యను ఇతరులతో పోల్చడం కొనసాగిస్తే అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. పోలికలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి, సంబంధాలను దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని నివారించడం మంచిది.
గౌరవం లేకపోవడం..
గౌరవం లేకపోవడం భార్యను బాధపెడుతుంది. ప్రతి స్త్రీ తన భర్త తన గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ భర్త ఆమెను పదే పదే విస్మరిస్తే, అది ఆమెను బాధపెడుతుంది. మరీ ముఖ్యంగా నలుగురిలో ఆమెకు గౌరవం ఇవ్వకుండా చిన్నతనం చేసి మాట్లాడితే ఏ మహిళా దాన్ని పాజిటివ్ గా తీసుకోదు.
సమయం కేటాయింపు..
ఈ రోజుల్లో అందరివీ బిజీ జీవితాలు అయిపోయాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని తీరికగా నాలుగు మాటలు మాట్లాడటానికి లేదా వారితో సమయం గడపడానికి కూడా సమయం లేకుండా చేస్తాయి. అయితే భార్యాభర్తల విషయంలో ఈ కారణాలు పనికిరావు. భర్త భార్యకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. ఆమెతో మాట్లాడాలి. సంతోషంగా సమయాన్ని స్పెండ్ చేయాలి. లేకపోతే ఇది ఇద్దరి మధ్య దూరం పెంచి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
అబద్దాలు చెప్పడం..
చాలామంది భర్తలు అబద్దాలు చెబుతూ భార్యలను పిచ్చివాళ్లను చేస్తుంటారు. భర్త చెప్పేది అబద్దం అని అర్థమైనా చాలా వరకు భార్యలు లైట్ తీసుకుంటారు. కానీ ఎంతకాలం? పదే పదే అబద్ధం చెప్పే పురుషుడిని స్త్రీలు ఇష్టపడరు. అది వారి భర్త అయినా, బయటి వాళ్లు అయినా కూడా. అందుకే భర్త వీలైనంత తక్కువగా మాత్రమే భార్య దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాలి లేదా అసలు అబద్ధం చెప్పకుండా ఉండటం మేలు.
వినే ప్రవర్తన..
ప్రతి స్త్రీ తనతో ఉండే వ్యక్తి తాను చెప్పేది వినాలని కోరుకుంటుంది. తను చెప్పేది అతను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. భార్య చెప్పేది వినకుండా, ఆమె భావాలను పట్టించుకోకుండా వెళ్లిపోయే వ్యక్తితో ఆమె కలిసి ఉండలేదు. కాబట్టి భార్య చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం భర్త తప్పకుండా చేయాల్సిన పని.
*రూపశ్రీ.