Diesel price up, LPG cylinders cut

The diesel price will go up by Rs. 5 a litre and a household will get only six domestic LPG cylinders per annum. These decisions were taken by the Cabinet Committee on Political Affairs. The decision to go in for the sharp diesel price hike, which excludes value added tax, will take effect from midnight on Friday.  Prime Minister Manmohan Singh, also decided to reduce the excise duty on petrol by Rs. 5.50 a litre from Rs. 14.78, adjusting the recent spurt in international crude prices, which have touched $114 a barrel. The restriction in supply of LPG cylinders is likely to help in reducing the under-recovery of OMCs by about Rs. 5,300 crore for the remaining part of the financial year. The under-recovery during 2012-13, even after this measure, is estimated to be above Rs. 32,000 crore. Any number of cylinders will be available over and above the cap of 6 cylinders at market rate. The number of cylinders available to each consumer in the remaining part of this financial year will be 3 cylinders, an official statement said.

జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను : జగ్గారెడ్డి

  కాంగ్రెస్ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల్లో మర్చిపోలేనిదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది.  అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని  హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా సతీమణి నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు  

శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

  (శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్) మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు.  ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు.  సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి. అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు. దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా.  ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు.  రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

కార్పొరేషన్ మేయర్లు, మునిసిపల్ చైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు

కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను తెలంగాణ  ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక  కార్పొరేషన్‌ చైర్మన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌  ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్,  గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.

ఏపీ మద్యం స్కాం.. విజయసాయికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.  

పాపం దానం.. కింకర్తవ్యం

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.   ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   

రాహుల్ నోట మళ్లీ ఓటు చోరీ మాట!

కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నోట మళ్లీ ఓటు చోరీ మాట వచ్చింది. మహా మునిసిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఎన్నికలలో ఓటు వేసే సమయంలో ఓటర్ల వేలికి వేసే సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో  ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు. కాగా ఓటర్ల వేలికి సిరాకు బదులు మార్కర్ పెన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి యేతర పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహా మునిసిపోల్స్ లో మరీ ముఖ్యంగా బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. 

బీహార్ లో కాంగ్రెస్ జీరో కానుందా?

బీహార్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జేడీయూ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వారీ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్  ఖండించింది. కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం.  ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'దహీ-చూరా' విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. దీనికి తోడు సంక్రాంతి తరువాత కాంగ్రెస్ లో పెద్ద కుదుపు ఉంటుందంటూ ఎన్డీయే నేతల ప్రచారం కూడా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ గూటికి చేరనున్నారన్న ప్రచారానికి ఊతం ఇచ్చింది.   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలలో  మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఆరుగురూ కూడా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో  రాష్ట్రంలో కాంగ్రెస్ బలం శూన్యం  అవుతుందన్న చర్చ మొదలైంది. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ యూ గూటికి చేరితే ఆ పార్టీ బలం బీజేపీని మించుతుంది.    243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా జనతాదళ్ యూ గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారన్న ఆయన పార్టీ కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇటువంటి ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.  

పొత్తులకు మాయావతి గుడ్ బై.. యూపీలో అధికారం కోసం ఒంటరి పోరు

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఎన్నికల పొత్తులకు గుడ్ బై చెప్పేశారు. యూపీలో బీఎస్పీకి పునర్వైభవం, పునరాధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఒంటరి పోరుకే సై అనేశారు. ఈ మేరకు గురువారం (జనవరి 14) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ,  2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి చెప్పారు. అంతే కాదు..  ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికలలో ఏ కూటమితోనూ, ఏ పార్టీతోనూ  జతకట్టకుండా  ఒంటరిగా పోటీలోకి దిగడానికే తమ పార్టీ మొగ్గు చూపుతోందన్నారు.  బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వాలు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను నిర్లక్ష్యం చేశాయని, కనీసం ఆయన మరణించిన రోజును సంతాపం దినంగా ప్రకటించలేదనీ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లింలు, ఇతర వర్గాలను చిన్నచూపు చూశారని, అదే బీఎస్పీ పాలనలో  సమానత్వం వెల్లివిరిసిందనీ, రాష్ట్రంలో మతపరమైన కలహాలు జ రగలేదనీ గుర్తు చేశారు.  ఇక ఆమె ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమన్న మాయావతి.. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెప్పారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాయావతికి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.  మాయావతి ఒంటరి పోరు ప్రకటనతో యూపీలో రాజకీయాలు రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ క‌న్ఫర్మ్ అయిన‌ట్టేనా!?

  కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండ‌గా, ఇద్ద‌రు జ‌న‌సేన‌, ముగ్గురు బీజేపీ, న‌లుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ రూపంలో  కేంద్రంలో మంత్రి ప‌ద‌వులుండ‌గా.. బీజేపీ నుంచి శ్రీనివాస‌వ‌ర్మ కూడా  కేబినేట్ లో స‌హాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి  అవ‌కాశం ల‌భించింది తొలి  మంత్రి వ‌ర్గంలోనే వీరు స్థానం సంపాదించారు. అయితే  కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మ‌రీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ ల‌భించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి  వెళ్లిన  చంద్ర‌బాబు అమిత్ షాతో భేటీలో ఈ విష‌యం  ఆయ‌న చెవిలో వేసి  వ‌చ్చారు. దీంతో ప్ర‌తిపాద‌న‌లు పంప‌మ‌ని  కేంద్రం నుంచి స‌మాచారం వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి  ప్ర‌భాక‌ర్ రెడ్డి  పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా  ఈ సారికి ఒక రెడ్డి సామాజిక‌వ‌ర్గం పేరు ప్రతిపాదించిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే  నెల్లూరు జిల్లా  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా  మారిపోయాయి. అంతే కాకుండా  ప్ర‌కాశం జిల్లాలోని  కొన్ని సెగ్మెంట్ల‌లోనూ వేమిరెడ్డి  ప్ర‌భావం ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం క‌ట్ట‌బెడితే  ఆయ‌న ద్వారా రెండు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన‌ట్టుగా  ఉంటుంద‌ని భావించిన టీడీపీ అధిష్టానం ఆయ‌న పేరు కేంద్ర మంత్రిగా  సిఫార్సు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన‌కుగానీ ఒక మంత్రి ప‌ద‌వే ఇస్తే.. బాల‌శౌరి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర ప‌ద‌వులు ఇస్తార‌న్న మాట కూడా జోరుగాన‌నే ప్ర‌చారం  సాగుతోంది. ఒక ద‌శ‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు  వినిపించిన‌ప్ప‌టికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కార‌ణం వేమిరెడ్డి  స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డి  కూడా  జిల్లాలో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌క‌త్వం వ‌హించ‌డం.. వంటి అంశాల‌ను  ప‌రిగ‌ణ‌లోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్య‌త‌ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా

ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో  కలిసి  పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.  రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను  ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు.  కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్.   మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు.   అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో   12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం  12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్  వివరించారు.  ఎంపరాడా  వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ,  కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.  బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.    చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న  ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని  విమర్శించారు.  థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.  మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ,  బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్  "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.   ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం  తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.