హిందీ ‘ఒక్కడు’ తుస్
posted on Jan 10, 2015 @ 3:47PM
మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలో ‘తెవర్’ పేరుతో జనవరి 9న దేశవ్యాప్తంగా మూడు వేల థియేటర్లలో విడుదలైంది. అమిత్ శర్మ దర్శకత్వంలో సంజయ్ కపూర్, బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించారు. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. క్రేజీ కాంబినేషన్ కావడం, తెలుగులో ఘన విజయం సాధించిన సినిమా కావడంతో ‘తెవర్’ మీద బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ అంచనాలన్నీ తలక్రిందులు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని దర్శక నిర్మాతలు భావించారు. అయితే సాధారణ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయేసరికి జనం థియేటర్ల దగ్గరకి క్యూలు కడతారని అనుకున్న ఊహలన్నీ పటాపంచలయ్యాయి. విడుదలైన మొదటిరోజు మొదటి షోకి ఈ సినిమా హౌస్ ఫుల్ అయిన థియేటర్ల శాతం చాలా తక్కువని తెలుస్తోంది. సెకండ్ షోకి వచ్చేసరికి అన్ని థియేటర్లలో 40 శాతానికి మించి ప్రేక్షకులు ఉండకపోయేసరికి నిర్మాతల గుండెల్లో రాయి పడింది. సినిమా నచ్చిందా లేదా అని ప్రేక్షకులను అడిగితే వాళ్ళు పెదాలు విరుస్తున్నట్టు సమాచారం. పన్నెండేళ్ళ క్రితం తీసిన తెలుగు సినిమాని ఇప్పుడు హిందీలో తీస్తే పరిస్థితి ఇలాగే వుంటుంది.