ఎన్నికల వాయిదాతో విద్యార్థుల్లో టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు విద్యార్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోస‌మే 10వ త‌ర‌గ‌తి పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటనే భయం నెలకొంది. పరీక్షలు యధావిధిగా జరుగుతాయా? లేవా? అనే భయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది.

మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు విద్యాసంస్థల పరంగా ఎలాంటి సెలవులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈనెల 18వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మార్చి 31వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3200 కోట్ల నిధులు రావన్న కారణంగా, ఎన్నికల కోసం పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ దెబ్బతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు వారాల పాటు ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు వాయిదా పడ్డాయి.

Teluguone gnews banner