శంకరన్న శపథం!
posted on Nov 12, 2013 @ 6:02PM
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మంత్రిపదవి ఊడిపోయాక ఏం చేయాలో అర్థం కాక అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి, తనపార్టీ వాళ్ళని, పరాయిపార్టీ వాళ్ళని తిట్టిపోస్తూ టైమ్‌పాస్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే మాత్రం శంకరన్నకి ఎంతో అభిమానం. ఆమెని అమ్మా అని నోరారా పిలుస్తూ, కీర్తిస్తూ వుంటారు. ఎవరేమి అనుకున్నా సోనియాగాంధీని కీర్తించడంలో మాత్రం ఆయన ఎంతమాత్రం రాజీపడరు.
శంకరన్న నోరారా సోనియాగాంధీని పొగుడుతుంటే వినడానికి రెండు చెవులూ చాలవనిపిస్తూ వుంటుంది. శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదుగానీ, ఆయన సోనియమ్మని పొగిడే వీడియోకి ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేసి సోనియాగాంధీకి చూపిస్తే ఆమె పొంగిపోయి శంకరన్నని దేశప్రధానిగా కూడా ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోందంటే, శంకరన్న సోనియమ్మని మళ్ళీ మరోసారి పొగిడారు. తెలంగాణ ఇచ్చేసిన సోనియాగాంధీ సాక్షాత్తూ దేవతట!
తెలంగాణ అంతటా ఆమెకి దేవాలయాలు కట్టితీరాలట. శంకరన్న అక్కడితో ఆగలేదు. తన సోనియా భక్తిని చాటుకోవడానికి ఒక మంచి ప్రపోజల్‌తో ముందుకొచ్చారు. సికింద్రాబాద్‌లో సోనియాగాంధీ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తారట. ఆరు నూరైనా డిసెంబర్ తొమ్మిదో తేదీన సోనియాగాంధీ విగ్రహావిష్కరణ జరిపి తీరుతారట. బాగుంది శంకరన్నా.. చాలా బాగుంది! నిక్షేపంలా వున్న సోనియాగాంధీకి విగ్రహాన్ని పెట్టాలన్న శంకరన్న ఆలోచనని ఆయన సహచరులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు చాలా గ్రేట్.
సీమాంధ్రులు సోనియాగాంధీకి సమాధి కడితే, తెలంగాణ వాళ్ళు ఆమెకి గుడులు కట్టి, శిలావిగ్రహాలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. చూడ్డానికి ఈ రెండూ పరస్పర విరుద్ధంగా అనిపించినా, రెండిటి అర్థమూ ఒకేటే కదా అని కాస్తంత బుర్రపెట్టి ఆలోచించేవాళ్ళు నవ్వుకుంటున్నారు.