టీ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయ
posted on Sep 7, 2015 @ 5:46PM
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తినడం కొత్తేమి కాదు. ఇప్పటి వరకూ చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు హెల్మెట్ ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది.
ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు చేయాలన్న నిబంధనపై తెలంగాణ రవాణాశాఖ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ముందు హెల్మెట్ల వినియోగంపై ప్రజలలో చైతన్యం కలిగించాలని.. ఓ పదిహేను రోజుల పాటు హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ తరువాత హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ రవాణాశాఖ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా హైకోర్టు ఖండించింది. ఎవరైనా కొత్త వాహనం తీసుకున్న వెంటనే హెల్మెట్ కూడా తీసుకోవాలన్న నిబంధనలో ఎలాంటి అర్థం లేదని తోసిపుచ్చింది. మరి ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తుందో లేక ఇదే ధోరణి కొనసాగిస్తుందో చూడాలి.