తెలంగాణలో లాక్ డౌన్?
posted on May 10, 2021 @ 9:43PM
తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ దిశగా పయనిస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రకటించిన కేసీఆర్.. తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అనే అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు సైతం చర్చకు రానున్నట్లు సమాచారం.లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియమీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణలో విధిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా కట్టడి నిమిత్తం లాక్‌డౌన్ విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే రాత్రిపూట కర్ఫ్యూ మినహా ఎలాంటి కఠిన ఆంక్షలు లేకపోవడం గమనార్హం. దీంతో కొన్ని వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో వాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల రాష్ట్రానికి వాక్సిన్ కోటా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ మరణాలపై తప్పుడు నివేదికలు ఇస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుతూ కేంద్రానికి తప్పుడు సలహాలిస్తున్నారని వెంకట్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.