బార్లు బార్లా.. స్కూళ్లు మూత!
posted on Mar 27, 2021 @ 2:44PM
కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ విద్యా సంస్థలను మూసివేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ కాలేజీలు తప్ప అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. సర్కార్ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల మూతతో వేలాది మంది టీచర్లు, లెక్చరర్లు రోడ్డున పడ్డారు. వారంతా ఆందోళనలు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, మళ్లీ స్కూల్స్ , కాలేజీలు మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని బోరుమంటున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా టెస్మ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా పేరుతో ప్రైవేటు స్కూళ్లను మూసివేయడం దారుణమని అన్నారు. సినిమా థియేటర్లు, బార్లను తెరిచే ఉంచారని... దీనివల్ల కరోనా రాదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ప్రాంతాలకు వెళ్లరా? అని నిలదీశారు. ప్రభుత్వ గురుకులాల్లో కరోనా కేసులు వస్తే... శిక్ష తమకెందుకు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి చేయాలనుకుంటే... ప్రతి వ్యవస్థను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను తెరిచి ఉంచి, విద్యాసంస్థలను మాత్రమే మూసివేస్తామంటే కుదరదని టెస్మా ప్రతినిధులు హెచ్చరించారు.
ప్రైవేటు పాఠశాలల మూసివేత నిర్ణయం వలన లక్షలాది విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు వేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు. పదోతరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి కానందున వారు పరీక్షలు రాయడానికి కష్టం అవుతుందన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు పోటీ పడలేక మంచి ర్యాంకులు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు రాయటం చదవటం వంటి కనీస విద్యా ప్రమాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రైవేటు ఉపాధ్యాయులు గత సంవత్సరం కాలంగా ఉపాధి లేక అనేక ఇతర పనులు చేసుకోలేక వారి కుటుంబ పోషణ కష్టంగా మారి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి తలెత్తిందని కావున వారికి ప్రభుత్వం నెలకు ఏడు వేల రూపాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.