జగన్ పాలనను మరోసారి ఏకి పారేసిన తెలంగాణ మంత్రి
posted on Sep 30, 2022 7:36AM
ఏపీ అభివృద్ధి లేమికీ, అరాచకానికీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఈ మాట ఏ తెలుగుదేశం పార్టీ వారో, లేదా రాష్ట్రంలోని వైసీపీ ప్రత్యర్థులో, సీఎం జగన్ వ్యతిరేకులో అనడం లేదు. పొరుగు రాష్ట్రం మంత్రులు బహిరంగ సభలలో చెబుతున్నారు. ఏపీలో జగన్ పాలన నిర్వాకాన్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీలో, విపక్షమో విమర్సిస్తే ఏదో అనుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రాల మంత్రులు తమ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతోందో చెప్పుకోవడానికి అభివృద్ధి లేమికీ, అరాచక పాలనకూ నమూనాగా ఏపీని చూపిస్తున్నారు.
తాజాగా హరీష్ రావు ఏపీలో ఉద్యోగులు, టీచర్లు పడుతున్న అవస్థలను, ఆందోళనలను ఆ ఆందోలనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉద్యోగులను ప్రభుత్వం ఎంతో గొప్పగా గౌరవిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులపై కేసులు పెట్టి లోపలేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి మంచి ఫిట్ మెంట్ ఇచ్చి గౌరవించిందని చెప్పారు.ఏపీలో టీచర్లు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిపై ప్రభుత్వం పలు రకారల కేసులు పెట్టింది. అరెస్టులు చేయించింది. అంతేనా ఉపాధ్యాయులకు బ్రాందీ షాపుల వద్ద డ్యూటీలు వేసింది. బాత్ రూములు శుభ్రం చేయించింది. ఆ ఫొటోలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు అవే అంశాలను ప్రస్తావించిన తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలంగాణ టీచర్లను తాము ఎంత గౌరవం ఇస్తున్నామో వివరించారు.
తమ పాలన ఎంతో గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఏపీలో జగన్ పాలనను హేళన చేశారు. హరీష్ రావు చెప్పిన వన్నీ వాస్తవాలే. ఏపీ లో జగన్ సర్కార్ పొరుగు రాష్ట్రాలలో ఎంతగా నవ్వుల పాలౌతోందో చెప్పడానికి తాజాగా హరీష్ రావు వ్యాఖ్యలు తిరుగులేని రుజువు అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే కాదు.. తెలంగాణ మంత్రులు సమయం దొరికినప్పుడల్లా ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్వాకాలపైనా, పరిపాలనా తీరుపైనా విమర్శలు గుప్పించడం ఒక రివాజుగా మారిపోయింది. తమ పాలనను గొప్పగా చూపుకోవడానికి ఏపీ సర్కార్‌పై వేసిన సెటైర్లు వేయడానికి వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కామన్. మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు తగిలించడమేనని .. అలా మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఏపీ సర్కార్ అప్పు తెచ్చుకుందనీ, రైతుల మెడకు ఉరితాళ్లు వేయడానికి అంగీకరించి ఉంటే తమ రాష్ట్రానికీ ఏటా రూ. ఆరు వేల కోట్లు వచ్చేవనీ, కానీ తమకు కేంద్రం సొమ్ములు కాదు..రైతు సంక్షేమమే ముఖ్యం కనుక అంగీకరించలేదనీ కూడా హరీష్ రావు చెప్పారు.
గతంలో కేటీఆర్ ఏపీలో కరెంట్ కష్టాల గురించి ప్రస్తావించిన విధంగానే తాజాగా హరీష్ రావు కూడా తాను తిరుపతి వెళ్లినప్పుడు.. తాడిపత్రికి చెందిన ఓ రైతును కరెంట్ పరిస్థితి గురించి అడిగితే రోజుకు కేవలం మూడు గంటలు అదీ వచ్చి పోతూంటుందని చెప్పాడని హరీష్ రావు తెలిపారు. అయితే కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కాదు ఏపీలో పరిస్థితులను చూపుతూ తమ సర్కార్ ను పొగుడుకునే విషయంలో తెలంగాణ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఇలా ఎవరూ ఒక్క నిముషం కూడా సందేహించరు. పైగా వారి విమర్శలకు, హేళనలకు స్పందించేందుకు ఏపీ సీఎం సహా మంత్రులెవరికీ నోరు రాదు. జగన్ పాలనలో ఏపీ ప్రతిష్ట దిగజారిపోయిందనడానికి తెలంగాణ మంత్రుల విమర్శలే తిరుగులేని నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు .
గతంలో ఓ సందర్భంలో కేటీఆర్.. ఏపీలో నివసించడం నరకం అని తన స్నేహితులు చెప్పారని ప్రకటించారు. ఇప్పుడు హరీష్ రావు కూడా దాదాపుగా అదే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం మంత్రులు ఏపీ పరువును గంగలో కలిపేసేలా వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడానికి నోరు రావడం లేదంటే అందుకు కారణం ఏపీలో పరిస్థితులు అంత అధ్వానంగా ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ప్రతిష్ఠాత్మకమైన క్రెడాయ్ సమావేశంలో కేటీఆర్ ఏపీ బండారం బట్టబయలు చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని కేటీఆర్ కళ్లకు కట్టేలా వివరించారు. ఏపీలో విపరీత కరెంట్ కోతలు, ఊరూరా గుంతలు మయమైన రోడ్లు, తాగు-సాగు నీటి కష్టాలను ప్రపంచానికి తెలిసేలా.. కీలకమైన క్రెడాయ్ వేదికగా గొంతెత్తి చాటారు కేటీఆర్. ఏపీ పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలంటూ ఏపీ దుస్థితిని సభాముఖంగా వివరించారు. "పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానం, అన్యాయంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేదేదీ అతిశయోక్తి కాదు. పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవచ్చు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండి. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు" అని కేటీఆర్ అప్పట్లో అన్నారు.
చంద్రబాబు హయాంలో సన్‌రైజ్ స్టేట్‌గా ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని గురించి.. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగింది. ప్రపంచం మొత్తం నవ్యాంధ్ర వైపు ఆసక్తిగా చూసింది. కానీ జగన్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో ఏపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సీన్ రివర్స్ అయ్యింది. ఒక్కఛాన్స్ అంటూ అందలమెక్కిన జగన్.. ఏపీని అంథకారప్రదేశ్‌గా మార్చేశారు. ఎడాపెడా కరెంట్ కోతలు. చంద్రబాబు హయాంలో ఒక్క గంట కూడా కరెంట్ కోత అనే మాటే వినిపించలేదు. జగన్‌రెడ్డి పాలనతో మాత్రం ఒక్క గంట కరెంట్ ఉంటే అదే అదృష్టం అనేలా దాపురించింది.
అలాగే రోడ్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు మినహా.. ఈ మూడేళ్లలో కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు వైసీపీ. ఎక్కడికక్కడ దారుణంగా దెబ్బతిన్నాయి రహదారులు. అప్పులతో కాలం గడుపుతున్న సర్కార్ కు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది. చంద్రబాబు హయాంలో ఏపీ గురించి దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకునే వారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు జగన్ హయాంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఏపీ గురించి ఎవరు మాట్లాడినా హేళన చేయడానికే మాట్లాడుతున్నారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ అంటేనే భయపడి పారిపోతున్నారు. రాష్ట్రంలో జనం జగన్ కు అనవసరంగా ఒక్కఛాన్స్ ఇచ్చామని అంటున్నారు.