ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ
posted on Jan 31, 2024 7:48AM
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆమె కుండబద్దలు కొట్టారు. తాము వైసీపీలో లేమని, గతంలో జగన్ పార్టీలో ఉన్నామనీ, అయితే ఇప్పుడు ఆ పాపాన్ని ఇలా ఆయనకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేయడం ద్వారా కడిగేసుకుంటామని చెప్పారు. కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదీ కూడా.. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన కొండా సురేఖ మళ్లీ ఆ రాజన్న కుమార్తె వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత .ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం కోసం ప్రచారం చేస్తానంటూ ప్రకటించడంతో ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లో నయా జోష్ ను నింపింది.
అదీకాక.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత... కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి.. వైఎస్ కుమారుడు జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని మానుకోటలో ఓదార్పు యాత్రకు జగన్ వెళ్లిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులు ఆ యాత్రను అడ్డుకున్న సందర్భంలో కొండా సురేఖ.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన నాడు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి వదితమే. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
మరోవైపు వైఎస్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయాలు చేయడం.. మరో వైపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పకో లేక పోవడం.. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రాణాలకు సైతం తెగించి.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడంతో.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.ఆ సమయంలో కారు పార్టీలో చేరిన కొండా సురేఖ దంపతులు.. ఆ తర్వాత ఆ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించకుండా స్తబ్దుగా ఉండిపోయారు.
ఇంతలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో కొండా దంపతులు మళ్లీ.. హస్తం గూటికి చేరారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... కేసీఆర్ పాలన వైఖరిపై నిప్పులు చెరగడమే కాకుండా... కేసీఆర్ తెలంగాణ తెచ్చినా..ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీ అంటూనే.. ఆమె రుణం తీర్చుకునే తరుణం వచ్చిందంటూ ప్రజల మధ్యకు రేవంత్ రెడ్డి దూసుకెళ్లడం.. దాంతో తెలంగాణ ఓటర్లు.. హస్తం పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దేయడంతో.. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆయన కేబినెట్‌లో మంత్రిగా కొండా సురేఖ కొలువు తీరింది. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని.. పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలలో తాను కాంగ్రెస్ విజయం కోసం ప్రచారం చేస్తానంటూ కొండా సురేఖ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.