కాలేజీలు తెరిస్తే సీజ్!
posted on Mar 24, 2021 @ 4:04PM
కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో విద్యాసంస్థలను మూసి వేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ కాలేజీలు తప్ప మిగితా అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ కింద విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొన్ని ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు పాటించడం లేదు. సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు స్పందించింది. ఇంటర్మీడియట్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కళాశాలలు మూసేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ప్రత్యక్ష తరగతులు లేనప్పటికీ ఆన్‌లైన్ బోధనను కొనసాగించాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ నేపథ్యంలో డిగ్రీ , పీజీ పరీక్షల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి త్వరలో రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు స్కూళ్లు మూత పడటంతో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయా?లేదా అనే సందిగ్దత నెలకొంది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలపైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.