పార్లమెంటులోనూ ఎదురు దెబ్బే
posted on Aug 11, 2014 @ 2:19PM
ఎంసెట్ అడ్మిషన్లపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిన్న తెలంగాణా ప్రభుత్వానికి లోక్ సభలోనూ అదే పరిస్థితి ఎదురయింది. గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ తెరాస యంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తూ లోక్ సభను స్తంభింపజేసే ప్రయత్నం చేసారు. వారికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బదులిస్తూ తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే నడుచుకొంటోoదని, ఆ చట్టప్రకారమే హైదరాబాదులో ప్రజలకు రక్షణ కల్పించేందుకు గవర్నరుకు భాద్యతలు, అధికారాలు కల్పించిందని తెరాస సభ్యుల నిరసనల మధ్య సమాధానం తెలిపారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అన్యాయం చేయాలని భావించట్లేదని, తెలంగాణకు కూడా అన్ని విధాల న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోంమంత్రి సమాధానంతో గవర్నరుకు అధికారాలు కట్టబెట్టాలనే కేంద్ర వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టమయింది. ఊహించినట్లే తెరాస యంపీల ఆందోళన కేవలం కంటశోషగా మిగిలిపోయింది.
ఇక సుప్రీం కోర్టు తలుపు తట్టడమే మిగిలింది. అయితే ఈరోజు ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో అంతా విభజన చట్ట ప్రకారమే ఖచ్చితంగా జరగాలని స్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు బహుశః ఈ విషయంలో కూడా అదేవిధంగా చెప్పవచ్చును. గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడమేనని తెలంగాణా ప్రభుత్వం వాదన సాధారణ పరిస్థితుల్లో మాత్రమే అన్వయించుకోవలసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన తరువాత మరే ఇతర రాష్ట్రాలకు లేని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గత ప్రభుత్వం భావించినందునే కొన్ని ప్రత్యేక నిబంధనలు విభజన చట్టంలో చేర్చవలసి వచ్చింది. కనుకనే గవర్నరుకు అధికారాలు కట్టబెట్టవలసి వచ్చింది. ఆ చట్టాన్ని తెరాస యంపీల సమక్షంలో పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్రపతి దానిపై ఆమోదముద్ర వేసారు. ఈ సంగతి తెలంగాణా ప్రభుత్వానికి కూడా తెలిసి ఉన్నప్పటికీ పంతానికి పోయి భంగపడుతోంది. ఒకవేళ ఇంకా పంతానికి పోయి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినట్లయితే బహుశః మరోమారు భంగపాటు తప్పకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర, తెలంగాణా అనే తన ప్రాంతీయభావాలను అధిగమించి తెలంగాణాలో స్థిరపడిన ప్రజలందరినీ సమానంగా చూస్తూ, వారిలో అభద్రతాభావం తొలగించేందుకు గట్టిగా కృషి చేసినట్లయితే ఇటువంటి సమస్యలన్నీ వాటంతటవే సర్దుకునే అవకాశం ఉందనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.