పార్టీలకతీతంగా ఏకమైన ఉద్యమ కారులు.. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టే?
posted on Jul 9, 2021 @ 6:39PM
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.. కొందరు జైళ్లకు కూడా వెళ్లారు. ఉద్యోగాలు వదిలేసి మరీ కొందరు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అందరి పోరాటం ఫలించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దించింది. రాష్ట్రం వచ్చి ఏడేండ్లు పూర్తయ్యాయి. అయినా మళ్లీ తెలంగాణ ఉద్యమ కారులంతా రోడ్డెక్కుతున్నారు. ఎందుకో తెలుసా.. తమ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరనందకు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులంతా మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు రావడానికి పాలకులే కారణమని చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్లే తామంతా మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత ఏడేండ్లుగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్ని నీరుగారిపోయాయని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ పేరుతో కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ పై జనాగ్రహం తీవ్రంగా ఉండటంతో ఇదే అదనుగా తమ కార్యాచరణ మొదలు పెట్టి.. దూకుడుగా వెళుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన, చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడమే తమ లక్ష్యమంటున్నారు. రాజకీయాలకు అతీతంగా, కేసీఆర్ గడీల పాలన అంతమొందిస్తామంటూ
తెలంగాణ ఆకాంక్షల వేదిక పేరుతో ఉద్యమకారుల ఐక్య వేదిక పురుడు పోసుకుంది.
ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక పేరుతో ఇప్పటికే మూడు సమావేశాలు జరిపారు. ఉద్యమకారులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి వేలాది మంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కలిసి ఉద్యమించాలని నిర్ణయించారు. ఈనెల 12న వరంగల్, 15న కరీంనగర్ లో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. వరంగల్ లో సభా ఏర్పాట్లు చేయడానికి వేణుగోపాల్ రెడ్డి ముందుకు వచ్చారు. తెలంగాణ కరుడుగట్టిన ఉద్యమకారులైన గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా వచ్చారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వేరువేరు పార్టీల్లో ఉన్న నేతలు కూడా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి విజయరామారావు, కపిలవాయి దిలీప్ కుమార్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నాయకులు డీకే అరుణ, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఎం సుదర్శన్ రావు, రాములు నాయక్ హాజరై ఉద్యమకారులకు తమ సపోర్ట్ తెలిపారు. బండి సాదానంద్, రవీంద్ర నాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు. ఉస్మానియా విద్యార్థులు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టరు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ఉద్యమకారులంతా ఏకం కావడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా ఒకే వేదిక మీదకు రావాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు. ఉద్యమ ఆకాంక్షల వేదిక సభను చూస్తే.. కేసీఆర్ కు ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు.. త్వరలో జరగనున్నహుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరికి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది.