తెలంగాణ సీఎస్ కు కరోనా.. ఇటీవల కేసీఆర్ తో వరుస సమీక్షలు
posted on Apr 6, 2021 @ 4:12PM
తెలంగాణలో రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా భారీన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సీఎస్ కు కరోనా సోకడంతో తెలంగాణ సచివాలయంలో భయాందోళన నెలకొంది. కొన్నిరోజులగా సీఎస్ చాలా సమీక్షలు నిర్వహించారు. ఆయనతో సమావేశాలకు హాజరైన అధికారులంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ సమావేశమయ్యారు. ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్ సూచించారు.ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లోనూ ఆందోళన నెలకొంది.
మరోవైపు ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనావ్యాప్తి నివారణ చర్యలపై బుధవారం కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పకడ్భందీగా చేపట్టాలన్నారు.కరోనా పరీక్షలు పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రోజు వంద పరీక్షలను, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 పరీక్షలను, సివిల్ ఆస్పత్రిలో 3 వందల టెస్టులను నిర్వహించాలని తెలిపారు. వాటి ఫలితాలను కోవిడ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు.
కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని, ఇళ్లలో వసతి లేనివారిని ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్ సోమేష్ కుమార్. కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్ సోమేష్ కుమార్.