తెలంగాణ కాంగ్రెస్ యంపీలలో మళ్ళీ భేదాభిప్రాయలు
posted on Apr 15, 2013 @ 1:32PM
గతంలో తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ‘తెలంగాణ కోసం త్యాగాలు-పార్టీకి రాజీనామాలు’ అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ, తరువాత ఒకరితో ఒకరు విభేదాలంటూ అందరూ తమ పదవుల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ విషయంలో చెప్పుకోవాలంటే మధు యాష్కీ మరియు పొన్నం ప్రభాకర్ కొంత నిజాయితీగా ప్రవర్తించారని చెప్పవచ్చును. తమ అధిష్టానం ఈ రోజు కాకపోయినా రేపయినా తెలంగాణ తప్పకుండా ఇస్తుందని నమ్ముతున్నందునే రాజీనామాలు చేయబోమని వారు స్పష్టం చేసారు.
మిగిలిన యంపీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. కానీ వారే ఒకప్పుడు తమని సన్నాసులని, తెలంగాణ ద్రోహులని నోటికొచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ పార్టీ టికెట్స్ ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించగానే నిర్లజ్జగా ఆయన వెనక వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కానీ, అలాగా వెళ్లేందుకు కారణం మాత్రం తాము తెలంగాణ కోసం త్యాగం చేస్తున్నట్లు చెప్పుకోవడం విశేషం. తమ పార్టీ తెలంగాణ ఇవ్వనందుకే పార్టీని విడిచి పెడుతున్నాము తప్ప, ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ఆఫర్ చేస్తున్నదుకు మాత్రం కాదని ప్రజలని నమ్మమంటున్నారు. తెరాసతో చేతులు కలిపితే తెలంగాణ ఉద్యమం బలోపేతం అవుతుందని చెప్పుకొస్తున్నారు. రేపు ఆ పార్టీలో చేరిన తరువాత, తాము ఇంత కాలం భజన చేసుకొస్తున్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలను కేసీఆర్ తిడితే మరి వారు భరించగలరో లేదో వారికే తెలియాలి.
ఇక ఈ రోజు తెలంగాణ యంపీలు జి.వివేక్ ఇంట్లో సమావేశం అయ్యారు. ఈసారి మందా జగన్నాథం, కే.కేశవ్ రావు మాత్రం పార్టీని వీడి తెరాస తీర్ధం పుచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని సిద్దం అవగా, వివేక్, రాజయ్య మాత్రమే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోమరికొంత కాలం వేచిచూద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ,లిద్దరూ కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉండాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. మందా మరియు కేశవ్ రావులు ఈ నెల 27న ఆర్మూరులో జరగనున్న తెరాస 12వ ఆవిర్భావ సభలో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.