సచివాలయం కోసమే సెంట్రల్ విస్టాకు ప్రశంసలు! కమలం నేతలు ఇక కామేనా?
posted on Dec 9, 2020 @ 1:42PM
రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్టగా చెప్పుకుంటారు. కొన్ని సార్లు ఆయన ఎత్తులు విఫలమైనా ఎక్కువ సార్లు ఆయన సక్సెస్ అయ్యారనే చెబుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ మారుస్తూ వస్తున్నారు. పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనా, ప్రజల్లో తమపై వ్యతిరేకత వచ్చినట్లు గుర్తించినా, విపక్షాలను దెబ్బకొట్టాలన్నా కొత్త కార్యాచరణ రూపొందిస్తుంటారు గులాబీ బాస్. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ రాసిన లేఖ కూడా అందులో భాగమేననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కార్ నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రధానిని ప్రశంసిస్తూ కేసీఆర్ లేఖ రాయడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు. హైదరాబాద్ తో తాము నిర్మించ తలబెట్టిన కొత్త సచివాలయ నిర్మాణం కోసమే ప్రధానిని కేసీఆర్ అభినందిస్తున్నారని చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని బీజేపీ సహా ప్రతి పక్షాలన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశాయి. కొత్త సచివాలయ నిర్మాణంపై విపక్షాలు, జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేసీఆర్ అస్త్రంగా మార్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ లో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు కేసీఆర్. విపక్షాలు ఎంతగా ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గలేదు. సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్త నిర్మాణాల కోసం పాత సచివాలయాన్ని కరోనా సమయంలో అర్ధరాత్రి హడావుడిగా కూల్చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. అయితే కొత్త సచివాలయ నిర్మాణంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణంపై జనాల్లో కూడా వ్యతిరేకత కనిపించింది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఉన్న భవనాన్ని కూల్చేసి.. కొత్తది కట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలు సచివాలయ అంశాన్ని కూడా ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. సచివాలయం అంశం ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని కూడా చెబుతున్నారు.
కొత్త సచివాలయంపై విపక్షాలు, జనాల నుంచి విమర్శలతో నిర్మాణ పనులపై జాప్యం చేస్తూ వస్తోంది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఢిల్లీలో కొత్త పార్లమెంట్ నిర్మాణానికి కేంద్ర సర్కార్ డిజైన్ ఫైనల్ చేయడం, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయడంతో కేసీఆర్ కు ఇదో మంచి అవకాశంగా నిలిచింది. దీంతో వెంటనే యాక్షన్ లోకి దిగారు కేసీఆర్. ఢిల్లీలో కట్టబోతున్న కొత్త పార్లమెంట్ నిర్మాణాలను స్వాగతిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాసేశారు పార్లమెంట్ కొత్త భవనాన్ని స్వాగతించడం ద్వారా కొత్త సచివాలయంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలను కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారాని భావిస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ కు కొత్త భవనం కడుతున్నందున.. రాష్ట్రంలో నిర్మించబోతున్న సచివాలయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తే.. ఆ పార్టీ వైఖరి ప్రజలకు తెలిసిపోతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. బీజేపీతో పాటు ఇతర విపక్షాలు కూడా ఇప్పుడు గతంలో ఉన్నంత దూకుడుగా సచివాలయ నిర్మాణ విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉండదని రాజకీయ అనలిస్టుల అభిప్రాయం. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం ఇది చాలా ఇబ్బంకరంగా మారే అంశమని, కొత్త సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ కమలం నేతలు ఇకపై మాట్లాడకపోవచ్చనే అభిప్రాయం పొలిటికల్ అనలిస్టుల నుంచి వస్తోంది.