తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటలకే.. లైన్ క్లియర్ అయ్యిందా?
posted on Mar 11, 2025 @ 3:11PM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికన్న విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేసిందా? గత కొంత కాలంగా అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో కమలనాథులు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చేసిందా? అంటే పార్టీ వర్గాలే కాదు పరిశీలకులు కూడా ఔననే సమాధానం ఇస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోరులో అధిష్ఠానం జోక్యంతో లైన్ క్లియర్ అయిపోయిందనే అంటున్నారు. బీసీ వర్గానికి చెందిన ఈటలకే అధిష్ఠానం అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టనున్నదని చెబుతున్నారు. ఇటీవల ఈటల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవ్వడంతో. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కసరత్తును పార్టీ అగ్రనాయకత్వం ముగించేయడమే కాకుండా, ఈటలనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసేసిందని అంటున్నాయి.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది.
ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. గత ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీన బలోపేతం చేయడమే కాకుండా.. బీజేపీని అప్పటి అధికార బీఆర్ఎస్ తో దీటుగా తలపడే స్థాయికి ఎదిగేలా చేశారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయనను పార్టీ హైకమాండ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. అయితే పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న ఈ చర్య సానుకూల ఫలితాల సంగతి అటుంచి పార్టీలోనే తీవ్ర నిరసనను ఎదుక్కొంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో అంచనాలను అందుకోలేకపోయింది.
సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓ మేరకు మెరుగైన ఫలితాలను సాధించగలిగినా, ఆ క్రెడిట్ మాత్రం కిషన్ రెడ్డి ఖాతాలో పడలేదు. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా ఉండటంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎపింక చేసి నియమించాలని నిర్ణయించింది.
అయితే తెలంగాణలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది. అయితే ఇప్పుడిక హైకమాండ్ మల్లగుల్లాలకు చెక్ పెట్టేసిందని వినిపిస్తోంది.
ఒక వైపు ఎంత వ్యతిరేకత పొడసూపినా కర్నాటక బీజేపీ పగ్గాలు గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించేందుకు రెడీ అయిపోయిన బీజేపీ అగ్రనాయకత్వం అదే సూత్రాన్ని తెలంగాణలోనూ అమలు చేసి ఈటలను కన్ ఫర్మ్ చేసేసిందని అంటున్నారు. అందుకు తార్కానంగా ఈటల సతీసమేతంగా హస్తిన వెళ్లి మోడీతో భీటీ కావడాన్ని చూపుతున్నారు.