అసెంబ్లీ ఫైట్ కు అంతా సిద్ధం..
posted on Sep 23, 2021 @ 6:26PM
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కి కిక్కిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభ మవుతున్నాయి. కనీసం వారం పదిరోజులు అయినా జరిగే వర్షాకాల సమావేశాల్లో ఉరుములు, మెరుపులకు కొదవ ఉండదని వేర్ చెప్పనక్కర లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, దళిత బంధు పథకం, కొవిడ్ సంబంధిత సమస్యలు, ఆర్టీసీ ఆస్తుల అమ్మకానికి సంబంధించి వస్తున్న వార్తలు, డ్రగ్స్ మాఫియా చుట్టూ అల్లుకున్న సవాళ్ళు, వైట్ ఛాలెంజ్ ఇష్యూ, విద్యుత్ చార్జీల పేపు ప్రతిపాదనలు ఇలా ఒకటని కాదు, అనేక సమస్యలు హాట్ హాట్ గా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే దళిత బంధుకు చట్టబద్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది.
ఇదలా ఉంటే ఈరోజు (గురువారం) సమావేశాల ఏర్పాటు, భద్రత ఇతర సంబంధిత విషయాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సభ సజావుగా సాగేందుకు అధికారులు సహకారం అందించాలన్నారు.అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 1 వరకు కొనసాగే అవకాశముంది. తేదీలు, ఎజెండా వంటి విషయాలపై సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. ప్రొటెం చైర్మన్ హోదాలో భూపాల్ రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.
ప్రభుత్వం అయితే తూతూ మంత్రంగా సమావేశాలు జరిపించి, చేతులు తులుపుకోవాలనే అనుకుంటోంది. నిజానికి, రాజ్యంగ అవసరంగా మాత్రమే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందే కానీ, ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజాసమస్యలు చర్చించేందుకు సమావేశాలు నిర్వహించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తంతు ఇదే తీరుగ నడుస్తోంది. అయితే ఈ రోజు ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. అంటే కాదు, సభ లోపలే కాదు బయట కూడా ఎలాంటి ప్రజాందోళనకు ఆస్కారం లేకుండా పోలీసులు పూర్తి సహకారం అందించాలని కోరారు. అయితే, సభలోపలే కాకుండా సభ వెలుపల కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాసం లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని విపక్షాలు ఆరోపిస్తున్నారు.