రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణది నాలుగో స్థానం!
posted on Sep 2, 2022 6:40AM
దేశానికే తెలంగాణ మోడల్ అని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ఫైర్ అయ్యారు. ఆయన చెబుతున్న మాటలన్నీ డొల్ల అని గణాంకాలతో సహా వివరిస్తూ గాలి తీసేశారు.ఆర్థిక అరాచకత్వానికి తెలంగాణ సర్కార్ నమూనాగా నిలిచిందంటూ విమర్శలు గుప్పించారు. ఘనంగా వాగ్దానం చేసిన రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదనీ, రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ అప్పుల కుప్పలా మారిందన్నది వాస్తవమన్న నిర్మలా సీతారామన్.. రాష్ట్రాల అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందన్నారు.
ఇక తెలంగాణలో కోటి ఎకరాలను సాగులోకి తీసుకువస్తామంటూ ఘనంగా చెప్పుకున్న కేసీఆర్ అందు కోసం ప్రాజెక్టులు నిర్మాణం అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నారనీ, వాస్తవంలో ఆయన చేసంది ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచడమేనని దుయ్యబట్టారు. కామారెడ్డిలో జరిగిన ఒక సభలో గురువారం పాల్గొన్న ఆమె తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారని విమర్శించారు.
భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కాళేశ్వరం పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం .38,500 కోట్ల రూపాయలైతే కేసీఆర్ సర్కార్ దానిని లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలకు పెంచిందని నిర్మలాసీతారామన్ వివరించారు. ఎఫ్ఆర్‌బీఎమ్ పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందన్న ఆమె, రాష్ట్రంలో పుట్టే ప్రతి శిశువుపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు.
కేంద్రం పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు కేంద్రం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. అప్పులపై కేంద్రం కోతలు పెడుతోందని కేసీఆర్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్ధమన్నారు. బడ్జెట్లో పెట్టకుండా అప్పులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు? ఇష్టానుసారంగా అప్పులు చేస్తే కేంద్రం అడగకుండా ఎందుకు ఉంటుందన్నారు? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ గొప్పలు చెప్పుకునే ముందు మీ నిర్వాకంపై రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి దేశంలో తిరగాలని నిర్మలా సీతారామన్ అన్నారు.