సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు.. కవితకు లభించని ఊరట.. కేసీఆర్ మళ్లీ దెబ్బతిన్నారుగా?
posted on Oct 31, 2022 @ 3:01PM
తెలంగాణలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దు చేసింది టీఆర్ఎస్ సర్కార్ నిజానికి ఇందుకు సంబంధించిన జీవో ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు బయటపెట్టారు. ఇప్పటి దాకా గోప్యంగా ఉంచి ఇప్పుడు బయటపెట్టేందుకు కారణం కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ బోనులో నిలబడకుండా కాపాడుకోవడానికేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో సోదాలు నిర్వహించింది. కవిత సన్నిహితుడు బోయనపల్లి అభిషేక్ రావును అరెస్టు చేసింది.
అప్పుడెప్పుడూ రాష్ట్రంలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దయ్యిందని బయటపెట్టని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు దానిని బయటపెట్టడం వెనుక ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశం ఉందన్న భయమే కరణమని పరిశీలకులు అంటున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో మరిన్ని సోదాలను, కవిత సహా మరింత మంది విచారణను సీబీఐకి జనరల్ కన్సెంట్ నిరాకరిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ఇసుమంతైనా అడ్డుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీలో నమోదైన లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా తెలంగాణలో ఎవరినైనా విచారించాల్సి వస్తే, కవితనైనా సరే .. ఆ తెలంగాణ సర్కార్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఏ విధంగానూ ఆపజాలవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా ఢిల్లీలోనే నమోదైంది. ఆ కేసు మూలాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. దీంతో తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా ఏం ఫరక్ పడదు. సీబీఐ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలంగాణకు వచ్చి డిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును కొనసాగించే అధికారం ఆ దర్యాప్తు సంస్థకు ఉంది.
అలాగే దర్యాప్తులో భాగంగా కవిత సహా ఎవరిని విచారించాలనుకున్నా ఎలాంటి అడ్డంకులూ ఉండవు. వాస్తవానికి రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినంత మాత్రాన సీబీఐ ఆయా రాష్ట్రాలలో అడుగుపెట్టకుండా, దర్యాప్తు చేయకుండా ఆ రద్దు అడ్డుకోజాలవు. దర్యాప్తు కొనసాగించాలని కోర్టులు ఆదేశిస్తే… రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏం ఉండదు. తెలంగాణ అందుకు మినహాయింపేమీ కాదు. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల మహా అయితే ఏం అవుతుందంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసు నమోదైతే.. ఆ వివరాలను సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే దర్యాప్తులో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పరమైన కేసుల విచారణకు సీబీఐ కోర్టుకెళ్లి జీవోలు రద్దు చేయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణలుగా . లాలూ ప్రసాద్ యాదవ్ , వీరభద్రసింగ్, మధుకోడాల ఉదంతాలు ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకూ తమ రాష్ట్రాలలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ 9వ రాష్ట్రంగా అవతరించింది. వాస్తవానికి జనరల్ కన్సెంట్ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏదైనా ఒక కేసు దర్యాప్తును ఆ రాష్ట్రంలో సీబీఐ చేపట్ట వచ్చును. ఈ జనరల్ కన్సంట్ ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 30న జీవో జారీ చేసింది. ఈ జోవోను తెలంగాణ సర్కార్ శనివారం (అక్టోబర్ 29) బయటపెట్టింది. తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయడంతో తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ జీవో రద్దు చేసిన సంగతి బయటపడింది. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ బీజేపీ దాఖలు చేసిన విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినా ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ యథేచ్ఛగా ముందకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర బయట నమోదైన కేసులలో జనరల్ కన్సెంట్ రద్దైన రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులు ఉంటే.. వారిని సీబీఐ విచారించడాన్ని ఆ రద్దు ఏ విధంగానూ అడ్డుకోలేదు. అంటే ఎమ్మెల్సీ కవితకు ఈ జనరల్ కన్సెంట్ రద్దు వల్ల ఎలాంటి ఊరటా లభించే అవకాశం లేదు. దీంతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.