ఆసీస్ తో తొలి టెస్టు.. టీమ్ ఇండియా భారీ విజయం
posted on Feb 11, 2023 @ 1:36PM
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. స్పిన్ కు అనుకూలించిన నాగ్ పూర్ పిచ్ పై ఆస్ట్రేలియా పూర్తిగా తేలిపోయింది.
బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఇండియా పూర్తిగా పై చేయి సాధించింది. భారత్ 400 పరుగులు చేసిన ఇదే పిచ్ పై ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లోనూ కలిపి కూడా ఆ మాత్రం పరుగులు చేయలేకపోయింది. స్పిన్ పిచ్ కోసం ఆస్ట్రేలియా ముందుగానే సిద్ధమై ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోనికి దిగినా ఫలితం లేకపోయింది. తొలి టెస్టు ఆడుతున్న మర్ఫీ వినా మిగిలిన వారెవరూ భారత బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.
మర్ఫి తన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. మ్యాచ్ మూడో రోజే ముగిసింది. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 177 పరుగలకే ఆలౌట్ చేసిన ఇండియన్ బౌలర్లు, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ను 92 పరుగులకే చాప చుట్టేశారు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులు చేసిన సంగతి విదితమే. స్కిప్పర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆ తరువాత జడేజా, అక్షర్ పటేల్ లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో టీమ్ ఇండియాకు 222 పరుగుల ఆధిక్యత లభించింది. జడేజా 70 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 84 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను భారత బౌలర్లు కుప్ప కూల్చారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్ల పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు.ఇక షమి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.