జైలు నుంచి పట్టాభి రిలీజ్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
posted on Oct 23, 2021 @ 7:45PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి.ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు పట్టాభి అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని, రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్ 41 ఏ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది. 41 ఏ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.