సీఎస్ జవహర్ రెడ్డిని మార్చాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ
posted on May 28, 2024 @ 10:05AM
సీఎస్ జవహర్ రెడ్డి పక్షపాత వైఖరి కారణంగా జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థనే ఏపీ సీఎష్ జవహర్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని పేర్కొన్నారు. జవహర్ రెడ్డి కుమారుడు, బినామీల పేరిట సీఎస్ 800 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని కనకమేడల ఆరోపించారు. సీఎస్ అధికార యంత్రాంగాన్ని, తన అధికారాలను దుర్వినియోగం చేశారని ,ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో, కౌంటింగ్ సజావుగా సాగడంపై ప్రతిపక్షాలకు అనుమానం ఉందని కనకమేడల వెల్లడించారు. సీఎస్ వ్యవహార శైలి ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్ ని తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఈసీని కోరారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా విపక్ష నేతలందరూ జవహర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అలాగే సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా అమలు చేయకుండా వృద్ధుల మరణాలకు కారకులయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పలువురు అధికారులపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగానూ, ఆ తరువాత జరిగిన హింసాకాండతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే.. సీఎస్ బాధ్యతారహితంగా భోగాపురం పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ విపక్ష నేతలు నిలదీస్తున్నారు. తాజాగా కనకమేడల లేఖతోనైనా ఎన్నికల సంఘంలో కదలిక వస్తుందేమో చూడాలి.