151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టాన్ని పాటించరా? చట్టానికి అతీతులా?
posted on Apr 25, 2020 @ 3:41PM
లాక్ డౌన్ ఉల్లంఘించిన నేతలపై కేసులెందుకు పెట్టడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలి. సభలు నిర్వహించిన వైసీపీ నాయకులపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలని టిడిపి నేత భత్యాన చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లింఘించిన వారిపై మార్చి 25 నుండి 31 వరకు 75 వేల కేసులు, మొత్తంగా లక్షకు పైగా కేసులు రిజిస్టర్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ గారు చెబుతున్నారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నందుకు చెంగల్రాయుడు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీకాళహస్తి, కర్నూలు నగరం ఆంధ్రప్రదేశ్ కు వుహాన్ నగరంలా తయారయ్యాయి. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూధన రెడ్డి దీనంతటికీ బాద్యుడు. అతను నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వాహనాల్లో ఎన్నింటిపై కేసులు పెట్టారు. వాటిలో ఎన్ని సీజ్ చేశారు.? సూళ్లూరుపేటలో దాతలు ఇచ్చిన సరుకులను పంపిణీ చేసే నెపంతో మరో ర్యాలీ నిర్వహించారు. వాటిలో ఎన్ని వాహనాలపై కేసులు పెట్టి సీజ్ చేశారు.? ఏ 2 విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి అమరావతి, హైదరాబాద్ నిరంతరంగా తిరుగుతున్నారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టారు.?
తెనాలి, కొండెపి, పలమనూరు, నగరిలో శాసన సభ్యులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో మీకు తెలియదా.? వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు.? పలమనేరులో బ్రిడ్జి ప్రారంభించడం కోసం దండోరాగా వెళ్లారు. పుత్తూరు సుందరయ్య కాలనీలో లక్ష పెట్టి బోరు వేసినందుకు.. వెయ్యి మందిదతో పూలు జల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారో డీజీపీగారు బహిర్గతం చేయాలి. శ్రీకాళహస్తిలో వచ్చిన 60 కేసులకు ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ ఫలితమే. వెంటనే ఐపీసీ 307 సెక్షన్ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి.
చంద్రబాబు నాయుడు గారు జగ్జీవన్ రావ్ జయంతి, పూలే జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఇంట్లోనే నిర్వహించమని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం నేతలంతా అదే పాటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వందలు, వేల మందిని పోగేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహించిన వారిలో ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో డీజీపీగారు ప్రకటించాలి.
గోవా, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కనిపించడం లేదా.? దేశ విదేశాల నుండి లక్షలాది మంది వచ్చే గోవా ఇప్పటికీ గ్రీన్ జోన్ గా ఉందంటే.. అక్కడి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో చూడండి. మణిపూర్ పర్వతాలతో నిండిన ప్రాంతం. అక్షరాస్యత అత్యల్పం. అయినా అక్కడ కరోనా కేసులు లేవు. కారణం ప్రబుత్వం తీసుకుంటున్న చర్యలు కాదా.?
కరోనా వైరస్ ఎంతో ఆత్మాభిమానం కలిగినది. మనంగా వెళ్లి పిలిస్తేనే రాదు. వచ్చాక మనల్ని వదలదని వైసీపీ నేతలు గుర్తించాలి.
కిలో బియ్యం, అరకిలో టమాటా, పావుకిలో నూనె 10 మందికి ఇస్తే వెయ్యి మందిని గుమిగూడుస్తున్నారు. కోట్ల వేతనాలు చెల్లిస్తూ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఏం చేస్తోంది.? మణిపూర్ లో వాలంటీర్లు లేరు కానీ.. సరుకులు ఎంత క్రమశిక్షణతో పంచుతున్నారో ప్రబుత్వానికి కనిపిస్తోందా.?
దేశంలోని రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు అధికారులు, నాయకులు పాటుపడాలని ప్రధాని మోడీగారు పిలుపునిస్తే..
మన రాష్ట్రంలో గ్రీన్ జోన్ గా ఉన్న వాటిని రెడ్ జోన్లుగా మారుస్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఎమ్మెల్యే అప్పలరాజు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏడు జిల్లాలు దాటుకుని అమరావతికి వచ్చారు. స్పీకర్ అయితే ఏకంగా బహిరంగ సభ పెట్టారు. ఫలితం ఇప్పటి వరకు గ్రీన్ జోన్ గా ఉన్న శ్రీకాకుళంలో ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సారాయి ఏరులై పారుతోందని, ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందని స్పీకరే స్వయంగా చెప్పారంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.
మార్చి 25 నుండి లాక్ డౌన్ అమలులో ఉంది. ఎక్కడా ఎలాంటి రవాణా జరగకూడదు. కానీ.. కోడూరులో జిని పెక్ సంస్థ 5 ర్యాకుల బైరైటీస్ మద్రాసుకు పంపించింది. దానికి అక్కడి సీఐ నో అబ్జక్షన్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, మట్టి లారీలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే.. ప్రజలే అడ్డుకోవాల్సి వచ్చింది. ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదో డీజీపీ గారు సమాధానం చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అంత్యక్రియలకు మాత్రమే 20 మందిని అనుమతిస్తారు. కానీ అధికార పార్టీ నేతలు ఇంత మందిని వెంటేసుకుని తిరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది.? ర్యాలీలకు పోలీసులే ఎస్కార్ట్ కల్పించడం దుర్మార్గం కాదా.? పోలీస్ స్టేషన్ల ముందే సభలు జరుగుతుంటే పట్టించుకోరా.? కర్నూలులో ఐసోలేషన్ లో ఉన్న తమ బంధువులను ఎమ్మెల్యే పరామర్శించి వచ్చాడంటే దుర్మార్గం కాదా.? రాష్ట్ర వ్యాప్తంగా 500 వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి.
మీకు సమాచారం లేదా.? మీ ఇంటిలిజెన్స్ పనిచేయడం లేదని చెప్పడం వివరాలన్నీ మీకు అందిస్తాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నవారిపై కేసులు నమోదు చేయడానికి డీజీపీ ఎందుకు ఆలోచిస్తున్నారు.?
యూపీ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గారి తండ్రి చనిపోతేనే వెళ్లలేకపోయారంటే... అతని చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుంటే ప్రభుత్వ వైఫల్యం కాదా..? సామాన్యులు ఏదో అవసరంపై రోడ్డుపైకి వస్తే కేసులు పెడుతున్నారు. చితక్కొడుతున్నారు. కనగరాజ్ గారు చెన్నై నుండి అమరావతి వరకు ఎలా వచ్చారు.? అతనిపై ఎందుకు కేసు పెట్టలేదు.? చట్టం, న్యాయం అందరికీ సమానమని పోలీసు బాస్ గా మీరెందుకు గుర్తించడం లేదు.? 151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టం పాటించరా.? మీరేమన్నా చట్టానికి అతీతులా.? చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని గౌరవించి ఇంట్లో ఉన్నారు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. చట్టాన్ని పాటిస్తున్నవారిని అవహేళన చేస్తారా.?