టీడీపీని వదలి వెల్లాలనుకునే నేతల పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న అయ్యన్న........
posted on Oct 16, 2019 @ 4:11PM
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు వలస నాయకులకూ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.కొందరు నేతలు పార్టీ వీడతారని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మాటల తూటాలు పేలుతున్నాయి.ట్విట్టర్ లో ఘాటైన విమర్శలకు దిగుతున్నారు వివరాళ్లోకి వెళ్తే
ఉలుకూ లేదు పలుకూ లేదు అంటారు కదా అచ్చం అలాగే ఉంది విశాఖ తెలుగు దేశం పార్టీల పరిస్థితి
టీడీపీని వీడుతున్న కొందరు నేతలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నేత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యా నించినా మరెవరూ స్పందించకపోవటం చర్చ నీయాంశంగా మారింది.
ప్రస్తుతం విశాఖ టీడీపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టిడిపి ద్వారా ఉన్నత పదవులు పొందిన కొందరు నేతలు పార్టీని వీడుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే జిల్లాలో కొందరు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతుంది.దీంతో కేడర్లోను అయోమయం నెలకొంది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు ఉండరో అనేది అర్థం గాక తెలుగు తమ్ముల్లు తలలు పట్టుకుంటున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయులు పార్టీ మారడం ఖాయమని మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. గంటా కూడా టీడీపీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఇతర కార్యక్రమాలకు మాత్రం రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య ఎలాంటి సఖ్యత ఉందనేది విశాఖ టీడీపీలో ఎవరిని అడిగినా చిటికెలో చెప్పేస్తారు.
ఈనేపధ్యంలో ఏమైందో తెలియదు గానీ హఠాత్తుగా అయ్యన్న ట్విట్టర్ ద్వారా ఘాటైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. అవకాశవాదులే తరచూ పార్టీలు మారతారని అలాంటి చీడపురుగులు ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మురికి వదులుతుందని అయ్యన్న పాత్రుడు చాలా ఘాటైన పదజాలాన్ని ప్రయోగించారు.
కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి లాంటి పార్టీని వదిలిపోయి పిరికిపందలు పార్టీకి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.తాను మరణించినా ఒకే జెండాతో పోతానని నాలుగు పార్టీల జెండాలను కప్పుకోనని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.అయితే అయ్యన్న పాత్రుడు తన ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన ప్రత్యర్థులు ఏమి మాట్లాడలేకపోతున్నారు కానీ ఎన్ని విమర్శలొస్తున్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న నేతలెవ్వరూ బహిరంగంగా తాము టీడీపీని వీడతామని గాని వీడడంలేదని గానీ గట్టిగా ఖండించక పోవడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తుండడం పై టిడిపి నేతలు దృష్టి పెట్టకుండా ఇలా స్వపక్షంలోనే పరస్పరం విమర్శలు చేసుకోవడం ఏమిటీ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద విశాఖ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుండడం పార్టీ కేడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తుంది.
కొంత మంది నేతలు టీడీపీని వీడతారని పక్కా సమాచారం ఉంది కాబట్టే అయ్యన్నపాత్రుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారనేది ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వేచి చూడాలి అప్పుడే కదా పార్టీల ఉండేదెవరు పార్టీలు మారేది ఎవరు అని మనకు స్పష్టమవుతోంది.