నిబద్ధత, క్రమశిక్షణకు తెలుగుదేశం కేడర్ బ్రాండ్!
posted on Jun 3, 2024 @ 9:39AM
తెలుగుదేశం కేడర్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. గత పదేళ్లుగా తెలంగాణలో పార్టీ దాదాపు నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితమైనా, పార్టీ తరఫున పదవులు, హోదాలు అనుభవించిన నేతలు గోడ దూకేసి పక్క పార్టీలకు వలస వెళ్లిపోయానా.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. పార్టీ పట్ల అంకిత భావానికీ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. అదే విధంగా ఏపీలో కూడా ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ తన ప్రత్యేకత ఏమిటన్నది చాటింది.
ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, వేధింపులకు గురై, దాడులు, దౌర్జాన్యాలకు బాధితులుగా మారిన తెలుగుదేశం క్యాడర్ మొక్కవోని ధైర్యంతో వాటన్నిటినీ ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు సై అనడంతో క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగించిన జగన్ కు అన్ని విధాలుగా అండదండలు అందించిన పార్టీతో పొత్తును తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. బాహాటంగానే తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. పొత్తు అవసరాలను, అనివార్యతను పార్టీ నాయకత్వం వివరించినా సరిపెట్టుకోలేకపోయింది.
ఇక పొత్తులో భాగంగా బీజేపీకి అధిక స్థానాలను కేటాయించడంపై కూడా తెలుగుదేశం క్యాడర్ తన వ్యతిరేకతను బాహాటంగానే చాటింది. రాష్ట్రంలో నోటాతో పోటీ పడే ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కోసం ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలు ఎందుకు త్యాగం చేయాలి అని క్యాడర్ నిలదీసింది కూడా. క్యాడర్ లో అసంతృప్తి తమకు భారీగా లబ్ధి చేకూరుతుందని వైసీపీ కూడా చంకలు గుద్దుకుంది. అయితే ఒక సారి పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తరువాత, పార్టీ నేత కూటమి విజయం కోసం తెలుగు తమ్ముళ్లంతా పని చేయాలని పిలుపు ఇచ్చిన తరువాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం క్యాడర్ ఎస్ ఇఫ్.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక పార్లమెంటు స్థానాల్లో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులంతా తెలుగుదేశం కేండిడేట్సే అన్నట్లుగా పని చేశారు. పార్టీల మధ్య ఓట్ల బదలీ సజావుగా సాగడంలో క్యాడర్ నిబద్ధత, అంకిత భావం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఫలితం జూన్ 1 (శనివారం) వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిఫలించింది. తెలుగుదేశం, బీజేపీ మధ్య ఓట్ల బదలీ వందకు వంద శాతం అయ్యిందన్న సంగతి తేటతెల్లమైంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఏపీలో బీజేపీకి 13శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో పూర్తిగా ఒకశాతం ఓటు షేరు కూడా లేని బీజేపీ ఏకంగా 13 శాతం ఓట్ షేర్ సాధించగలిగిందంటే అది కచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ కూటమి అభ్యర్థుల విజయం కోసం రెండో ఆలోచన లేకుండా పని చేయడమేనని పరిశీలకులు అంటున్నారు. అధినేత మాటే శిరోధ్యార్యంగా తెలుగుదేశం క్యాడర్ పని చేసిన తీరుకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు. కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదలీ జరగడం అంటే నిజంగా అద్భుతమేనని అంటున్నారు. అటువంటి అద్భుతం జరగడానికి క్షేత్రస్థాయి నుంచి క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం క్యాడర్ వల్లే సాధ్యమౌతుందని చెబుతున్నారు.