తెదేపా సిట్టింగ్ ఎం.ఎల్.ఏ.లకే సీట్లు ఖాయం

 

తెదేపా 9సం.ల ప్రతిపక్షవాసం పూర్తి చేసుకొని, మళ్ళీ ఎన్నికలకి సిద్ధం అవుతోంది. ఈ 9సం.లలో పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు పోగా, పార్టీని కష్టకాలంలో కూడా నమ్మకంగా అంటిపెట్టుకొని మిగిలిన 76 మంది శాసన సభ్యులకే మళ్ళీ పార్టీ టికెట్స్ ఇవ్వాలని చంద్రబాబు నిశ్చయించుకొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా సమస్యాత్మకంగాలేని మరో 153 నియోజక వర్గాలాలో కూడా ఇప్పటికే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసేసినట్లు సమాచారం.

 

వీరుకాక చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నుండి యస్.విజయపాల్ రెడ్డి, కాకినాడ సిటి నుండి వనమది వెంకటేశ్వరరావు పేర్లను ఖరారుచేసిన విషయం తెలిసిందే. ఇక యనమల రామకృష్ణుడు శాసనమండలికి మారినందున ఆయన సోదరుడు యనమల కృష్ణుడుకి  తూర్పు గోదావరి జిల్లా తుని నుండి, దాడి వీరభధ్ర రావు లోక్ సభకు వెళ్లాలని భావిస్తున్నందున ఆయన కుమారుడు దాడి రత్నాకర్ అనకాపల్లి నుండి పార్టీ అభ్యర్ధులుగా దాదాపు ఖాయం అయినట్లేనని సమాచారం.

 

ఇక ఒకరి కంటే ఎక్కువ అభ్యర్ధులు పోటీలో ఉన్నవి, లేదా  కొంచెం సమస్యాత్మకంగా మిగిలిన 60 నియోజక వర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసే క్లిష్టమయిన పనిని చంద్రబాబు తన పాదయత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి రాగానే మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఏడాది ముందుగానే పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తానని చంద్రబాబే గతంలో స్వయంగా ప్రకటించారు. గనుక, వచ్చే నెల 23వ తేదీ నుండి హైదరాబాదులో జరగనున్న మహానాడు సభలలో ఆయన తన మొట్ట మొదటి అభ్యర్ధుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది.

 

తద్వారా అభ్యర్ధులు తమతమ నియోజక వర్గాలలో ముందే ప్రచారం చేసుకోవడమే కాకుండా రాబోయే ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని దైర్యంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకొని పూర్తి సన్నధం కాగలరు. పార్టీ టికెట్స్ కేటాయింపుల సమయంలో చెలరేగే అసంతృప్తి జ్వాలలు కూడా ఎన్నికల సమయానికి పూర్తిగా చల్లారే అవకాశం ఉంది గనుక, అప్పుడు పార్టీ కూడా నిశ్చింతగా ఎన్నికలకు వెళ్ళవచ్చునని పార్టీ నేతల అభిప్రాయం.

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఈ సారి ఇదే పద్దతి అనుసరించబోతున్నారు. తెరాస కూడా మే నెలాఖరులోగా పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించబోతోంది. ఇక డిల్లీ నుండి రిమోట్ తో పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఖరారు కావాలంటే డిల్లీవైపు, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్టు కోసం చంచల్ గూడా జైలు వైపు చూడాల్సిందే.

Teluguone gnews banner