బయ్యారంలో బయటపడిన కాంగ్రెస్ లుకలుకలు

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో తీసుకొంటున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నట్లే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు బయ్యారం గనుల కేటాయింపు కూడా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. తొలుత ఈ అంశంపై ప్రతిపక్షాల నేతలు ఒకరినొకరు నిందించుకొంటూ కత్తులు దూసుకొంటుంటే, చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ, ఇందిరమ్మ (పగటి) కలలు కంటూ కులాసాగా తిరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు అందులోకి కాంగ్రెస్ నేతలు కూడా వేలు పెట్టడంతో సమస్య తిరిగి ఆయన మెడకే చుట్టుకొంది.

 

స్వంత పార్టీ వారే రెండు వర్గాలుగా చీలి, కొందరు అది జాతీయ సంపదని, మరికొందరు తెలంగాణ సంపదని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కొందరు, సాంకేతికంగా కుదరదని మరికొందరు రకరకాల వాదనలు చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. చిలిచిలికి గాలివానగా తయారయిన ఈ వివాదం ఇప్పటికే పార్టీలో సభ్యుల మద్య ఉన్నదూరాన్ని మరింత పెంచడమే కాకుండా, వారి మద్య ఉన్న తీవ్ర విబేధాలను బయట పెట్టింది. తద్వారా పార్టీలో ఎన్ని లుకలుకలున్నాయో ఒక్కసారిగా బయట పడింది.

 

మొదట ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం, తరువాత పెంచిన విద్యుత్ చార్జీలు, ఆ వెంటనే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై సీబీఐ ఆరోపణలు వంటి వరుస దెబ్బలతో సతమత మవుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందాలేదా అని తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల దృష్టి మళ్ళించే ప్రయత్నంలో తలకెత్తుకొన్న ఈ బయ్యారం అంశం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోయలేని భారంగా మారింది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు చేజేతులా తెచ్చుకొన్నపటికీ ఆయనలో మార్పు రాలేదని ఈ అంశం స్పష్టం చేస్తోంది. బహుశః ఆయన తన ‘దూకుడు’ పై మీడియాలో వస్తున్నరాజకీయ విశ్లేషణలను చూసుకొని, అది కొనసాగిస్తే మరింత సత్ఫలితాలు ఇస్తుందనే భ్రమలో మరింత దూకుడు ప్రదర్శించడం వలననే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చును. ఒక సమస్య నుండి మరొక సమస్యలోకి పయనించడమే తన పద్దతిగా మార్చుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పుడు బయ్యారం గనుల్లోకి నెట్టారు. ప్రతిపక్షాలతో ఒక ఆట ఆదేసుకొంటున్నాననే భ్రమలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా సెల్ఫ్ గోల్ చేసుకోవడం విచిత్రం.

Teluguone gnews banner