బిల్లు ఓటమితో విభజన ఆగిపోతుందా?
posted on Jan 30, 2014 @ 3:54PM
విభజన బిల్లుని ఉభయ సభలలో ఓడించినందుకు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చుతుండగా, తెలంగాణాలో ప్రజలు ఆగ్రహంతో ముఖ్యమంత్రి తదితరుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఒకరు విజయం సాధించామని సంబరపడుతుంటే, వేరొకరు ఓడిపోయిన భావనతో ఆక్రోశం వ్రేళ్ళగ్రక్కుతున్నారు. అయితే ఈ విజయం, పరాజయం రెండూ తాత్కాలికమేనని ప్రజలందరూ గ్రహించాల్సి ఉంది. ఈరోజు శాసనసభ లో బిల్లును ఓడించడం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోదని అందరికీ చాలా బాగా తెలుసు. సీమాంధ్ర నేతలకు నిజంగా రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనే ఆలోచనే ఉండి ఉంటే, పరిస్థితిని ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ, పార్టీ టికెట్స్, మంత్రి పదవులకు,కాంట్రాక్టుల కోసం ఆశపడి ప్రజలని మభ్యపెడుతూ పరిస్థితులను ఇంతవరకు తీసుకు వచ్చారు. ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లు విభజన బిల్లుని సభలో ఓడించి తామేదో చాలా ఘన కార్యం చేసామని చెప్పుకొంటున్నారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఈ మాత్రమయిన ఉపశమనం కలగించి వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమే ఇది. అందుకే వివిధ రాజకీయ పార్టీల అధ్వర్యంలో కార్యకర్తలు రోడ్లమీధకు వచ్చి టపాసులు కాల్చి ప్రజాభిప్రాయానికి అడ్డం పడుతున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విజయం, ఆనందం రెండూ తాత్కాలికమేనని ఆ నేతలందరికీ తెలుసు. ఆదేవిధంగా సభలో బిల్లుని ఓడించినందుకు తెలంగాణా ప్రజల ఆక్రోశం వ్యక్తం చేయడం సహజమే. కానీ శాసనసభలో బిల్లుని ఓడించడం వలన విభజన ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనిస్తే, ఈ కారణంగా మాత్రం తెలంగాణా ఏర్పాటు ఆగదని స్పష్టమవుతోంది. కానీ, ఈ కారణంగా ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సుప్రీం కోర్టులో పిటిషన్లు పడినప్పుడు, బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని కోర్టు అడ్డుపడినా, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినా రాష్ట్ర విభజన ఆగవచ్చును. అంతే తప్ప కేవలం ఈ కారణంగానే విభజన ప్రక్రియ ఆగే అవకాశం లేదు.
అందువల్ల సీమాంధ్ర నేతలు ఏదో ఘన కార్యం సాధించినట్లు కాలరు ఎగురవేసుకొని తిరుగనవసరం లేదు. బిల్లు శాసనసభలో ఓడిపోయినందుకు తెలంగాణా ప్రజలు దిగులు చెందనవసరం లేదు. అయితే, తన రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొని తెలుగు ప్రజల మధ్య ఇంత అగాధం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టానం మాత్రం ఈ పరిస్థితులను చూసి సిగ్గుపడకపోగా నిర్లజ్జగా మాట్లాడటం సిగ్గు చేటు.