ఇలా చేరిక.. అలా పదవి
posted on Feb 17, 2024 @ 10:32AM
నిత్య జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అందులోనూ మతిమరుపు మనుషులను ఓ పట్టాన మరిచిపోలేం. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘ఉషికెల ఉంగురం పెట్టి పప్పుల దేవులాడినట్టు’. వాళ్ల స్వభావమే అంత.
మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత రాజయ్య విషయంలో అదే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ వీర విధేయుడైన రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది. రాజయ్య కూడా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజయ్య పదేళ్ల తర్వాత అదే పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో రాజయ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ రోజు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. రాజయ్య 15వ లోక్ సభకు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇప్పటికే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.