వివాదాలకు కేరాఫ్
posted on Aug 25, 2020 @ 12:27PM
తస్లీమా నస్రీన్(25ఆగస్టు 1962)
'సమాజంలోని సంఘటనలపై స్పందించే హక్కు అందిరికీ ఉంది. తమ అభిప్రాయాలు చెప్పేవారిని మతాల పరంగా, కులాల పరంగా విడదీయవద్దు' అంటారు తస్లీమా నస్రీన్. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పే ఆమె వివాదస్పద రచయితగా పేరు తెచ్చుకున్నారు. హేతువాదిగా, స్త్రీవాద, మానవహక్కుల కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె తలకు వెలకట్టినా తలవంచకుండా మత ఛాందసవాదులను ఎదిరించి నిలబడ్డారు. 1992లోబాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందిస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లీంలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా రాసిన 'లజ్జా ' నవల ఆమెను వివాదస్పద రచయితగా పరిచయం చేసింది.
బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ లో తస్లీమా 25ఆగస్టు, 1962న జన్మించారు. ముస్లీం కుటుంబంలో పుట్టిపెరిగినప్పటికీ ఆమె మతాలకు అతీతంగా మారారు. హేతు వాదిగా, నాస్తికురాలిగా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేవారు. వైద్య విద్యను పూర్తి చేసిన ఆమె 1994 వరకు ప్రభుత్వ డాక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రచనారంగం వైపు వచ్చారు. 1990 నుంచి తన అభ్యుదయవాద రచనలతో ప్రపంచ ప్రసిద్ధి పొందారు. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత సంఘటన, ఆ తర్వాత జరిగిన దాడులు ఆమెపై చాలా ప్రభావం చూపించాయి. బంగ్లాదేశ్ లో ఒక మతం వారు మరో మతం వారిపై మానవత్వం లేకుండా దాడులు చేయడంతో స్పందించిన ఆమె ఆ తర్వాత లజ్జా పేరుతో ఒక నవల రాశారు. మత ఛాందసవాదుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోన్నారు. ఆ నవల కాపీలను తగలబెట్టారు. ఆమెపై ఫత్వా జారీ చేయడమే కాక ఆమె తలకు వెల కట్టారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించారు. భారతదేశానికి వచ్చిన ఆమె కోల్ కత్తాలో నివాసం ఉంటున్నారు.
తస్లీమా ముస్లీం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపారు. బురఖా లో వారు అవమానాలను, అణిచివేతను ఎదుర్కోంటున్నారని ఎన్నోవేదికలపై తన అభిప్రాయాలను వెల్లడించి వివాదస్పద వ్యక్తిగా మారారు. కొద్దినెలల కిందట ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కుమార్తె ఖతీజా బుర్ఖా ధరించిన విషయంపై కూడా స్పందించి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ హీరో సుశాంత్ మరణం విషయంలోనూ ఆమె స్పందించారు.
'నేను మీ శత్రువును కాదు. ముస్లింల నిజమైన నేస్తాన్ని. విద్యావంతులు, మేధావులు తమ మతం సంస్కరించబడాలని కోరుకుంటున్నారు. నేనూ అదే కోరుకుంటున్నాను' అంటారు తస్లీమా. తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సస్(ఎయిమ్స్) దానం చేస్తున్నట్టు తస్లీమా ప్రకటించారు. మతానికన్నా మనవత్వమే ముఖ్యమని చాటారు.