తలసానీ! నైతిక విలువలంటే ఇవేనా?
posted on Jul 20, 2015 @ 10:22AM
తలసాని శ్రీనివాస్ యాదవ్ తెదేపాను వీడి తెరాసలో చేరే ముందు, తెదేపా ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాట్లు ప్రకటించారు. రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి ఉండేవాడిని గనుకనే పార్టీని వీడగానే ఆ పార్టీ ద్వారా తను గెలుచుకొన్న ఎమ్మేల్యే పదవిని కూడా త్యజిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు. ఆయన రాజీనామా చేశారని భావించిన గవర్నర్ నరసింహన్ ఆయన చేత తెలంగాణా వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేయించారు. కానీ నాటి నుండి నేటి వరకు ఆయన రాజీనామా ఆమోదం పొందనే లేదు. తను రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ దానిని ఆమోదించకబోతే తానేమి చేయగలనని ఆయన ప్రశ్నించేవారు.
ఆయనతో సహా తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుండి వచ్చి తెరాసలో చేరిన ఎమ్మేల్యేలందరి రాజీనామాలు ఆమోదించమని ప్రతిపక్షాలు స్పీకర్ కి వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఆయన వాటిని పట్టించుకోలేదు. వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు హైకోర్టుని ఆశ్రయించినపుడు ‘ఇంకా ఎంత సమయం తీసుకొంటారు?’ అంటూ కోర్టు కూడా మందలించింది. అంటే ప్రతిపక్షాలు, గవర్నర్, హైకోర్టు అందరూ కూడా తలసానితో సహా అందరి రాజీనామా లేఖలు స్పీకర్ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా లేఖను ఇంతవరకు తమకు పంపలేదని తెలంగాణా అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరి డా. నరసింహాచార్యులు సమాచార హక్కు క్రింద కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డికి తెలియజేసారు.
ఈనెల 8న ఆయన గండ్రకు వ్రాసిన లేఖలో “ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లేఖ మాకు అందలేదు,” అని విస్పష్టంగా పేర్కొన్నారు.
ఇంతవరకు చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలు మారారు. కానీ వారిలో ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప మరెవరూ కూడా తమ మాతృ పార్టీల ద్వారా గెలుచుకొన్నఎమ్మేల్యే పదవులకి రాజీనామాలు చేయలేదు. అలాగే నైతిక విలువల గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే, ఎమ్మేల్యే పదవులకి రాజీనామాలు చేసే ఉద్దేశ్యం వారికి లేదు కనుక నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా తమకి లేదని వారందరికీ తెలుసు. అందుకే మౌనం వహించారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం గతేడాది డిశంబర్ 16న మీడియా సమావేశం పెట్టి మరీ తను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించుకొన్నారు. కానీ తాజాగా బయటపడిన ఈ సమాచారంతో నైతికంగా అందరికంటే ఎక్కువ దిగజారిపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపకుండానే పంపినట్లు అబద్దం చెప్పడమే కాకుండా, రాజీనామా చేసానని చెప్పి గవర్నర్ నరసింహన్ కూడా మభ్యపెట్టి ఆయన చేతనే ప్రమాణ స్వీకారం కూడా చేయించుకొని మరో పెద్ద తప్పు చేసారని ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా తెరాస ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఇంతకాలం దాచిపుచ్చి గవర్నర్ని, హైకోర్టుని, శాసనసభని, ప్రజలను కూడా మభ్యపెట్టిందని ఆరోపిస్తున్నారు. నైతిక విలువల గురించి నిత్యం ప్రతిపక్షాలకు నీతులు చెప్పే అధికార తెరాస పార్టీ అందరినీ వచించించిదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం గవర్నర్ కి, న్యాయవ్యవస్థకి సంజాయిషీ చెప్పుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా కాంగ్రెస్, తెదేపా ఎమ్మేల్యేల రాజీనామా లేఖలను ఆమోదించమని ఆ రెండు పార్టీల నేతలు స్పీకర్ కి రెండు మూడు సార్లు విజ్ఞప్తి చేసారు. కానీ ఆయన కూడా వారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లేఖ తనకు అందలేదని చెప్పకుండా మౌనం వహించారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయం దాచిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఆ తరువాత వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా పిర్యాదు చేసారు. ఈ వ్యవహారం రాష్ట్రపతి వరకు వెళ్లిందని తెలిసినా కూడా తెలంగాణా ప్రభుత్వం తలసాని చేత రాజీనామా చేయించకుండా ఎటువంటి జంకు గొంకూ లేకుండా చాలా నిబ్బరంగా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈరోజు కాంగ్రెస్, తెదేపా నేతలు గవర్నర్ నరసింహన్ని కలిసి, డిప్యూటీ సెక్రెటరీ వ్రాసిన లేఖ ప్రతిని అందజేసి తలసానిపై,తెరాస ప్రభుత్వంపై కూడా పిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గవర్నర్ నరసింహన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా తెదేపా, కాంగ్రెస్ ఎమ్మేల్యేలల అనర్హత పిటిషన్లని విచారిస్తున్న హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.