ఇబ్బందుల్లో సూరీడు !
posted on Dec 26, 2012 @ 10:40AM
మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు నివాసంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసిబి) అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. వైఎస్ హయంలో ఆయన వెంటే తిరుగుతూ చక్రం తిప్పిన సూరీడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో జూబ్లీహిల్స్ గాయత్రీ నగర్లోని ఆయన నివాసంలో ఈ దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో కొన్ని విలువైన పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏ పి పి ఎస్ సి సభ్యుడు రిపున్జయ్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంభందాలు ఉన్నాయనే కారణంతోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సభ్యుడిఫై అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. రిపున్జయ్ రెడ్డి కమీషన్ లో సభ్యునిగా నియమితులైన తర్వాత ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని మీడియా లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నియామకం ముందు ఓ ఫ్లాట్ కొనడానికి కూడా డబ్బులు లేని రిపున్జయ్ ఆ తర్వాత రూ.100 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టినట్లు ఆ కధనాలు పేర్కొన్నాయి.
కాగా రిపున్జయ్ నివాసంలో కూడా ఈ దాడులు జరిగాయి. బ్యూరో డిఎస్పి చంద్ర శేఖర్ మీడియా తో మాట్లాడుతూ, వీరిద్దరూ కలిసి ఆస్తులు కూడబెట్టినట్లు తమ వద్ద సమాచారం ఉందని అన్నారు.