బాధితులు కష్టాలు చెప్పుకుంటే తప్పేంటి! కేంద్రానికి సుప్రీంకోర్టు చివాట్లు
posted on Apr 30, 2021 @ 3:40PM
సోషల్ మీడియాలో కరోనా బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటూ ఇతరులకు సమాచారం చేరవేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవద్దని.. ఒకవేళ అలా చేస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో బాధలు చెప్పుకోవడాన్ని అణచివేయడం తగదని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు.ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఓ పౌరుడిగా, న్యాయమూర్తిగా అది తనకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. తమకు బెడ్లు కావాలనో లేదంటే ఆక్సిజన్ కొరత ఉందనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరం కాదని, అలా తమ గోడు వెళ్లబోసుకున్న పౌరులను హింసిస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పౌరులు సోషల్ మీడియాలో లేవనెత్తిన బాధలు తప్పు అని అనుకోవడం తగదన్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే హోటళ్లు, ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలను కొవిడ్ సేవల కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు.
వ్యాక్సిన్లపైనా కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు జస్టిస్ డి.వై. చంద్రచూడ్. ఇలాంటి తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పూర్తిగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు ధరలు ఎందుకని నిలదీశారు. రాష్ట్రాలు 50 శాతం డోసులను కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇందులో సమానత్వం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నోళ్లు 59 కోట్ల మంది ఉన్నారని, పేద ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే ఇప్పుడూ అనుసరించాలని ప్రభుత్వానికి సూచించారు.
‘‘ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని ఆసుపత్రులకు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు సరఫరా చేస్తున్నారు? లాక్‌డౌన్ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలు ఏవి? నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా? మరి అలాంటి వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తున్నారు? స్మశానవాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారు? పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను కేంద్రం అమలు చేస్తోందా? వ్యాక్సిన్ డోసులను కేంద్రమే 100శాతం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే టీకాల ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి పంపిణీ వికేంద్రీకరణ చేయవచ్చు కదా? వ్యాక్సిన్ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదు? 18-44 ఏళ్ల మధ్య జనాభా ఎంత? వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత?’’ అంటూ ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తున్నారు? ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడిగింది. ఈ కేసు విచారణలో అమికస్ క్యూరీగా న్యాయవాదులు మీనాక్షి అరోరా, జైదీప్ గుప్తా కూడా కోర్టుకు హాజరయ్యారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.