సునీత కాంగ్రెస్ ఎంట్రీ.. కడపలో జగన్ పనైపోయినట్లేనా?
posted on Jan 29, 2024 8:37AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో సొంత కుటుంబం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికలలో ఆయన జిల్లాలో సొంత కుటుంబీకులతోనే తలపడాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే సొంత చెల్లి షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టి ఎన్నికల ప్రచార రంగంలో దూసుకుపోతుంటే.. ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సైతం కాంగ్రెస్ గూటికి చేరి జగన్ తో తలపడేందుకు సిద్ధమయ్యారు.
తండ్రి హత్య నిందితులకు శిక్ష పడేంత వరకూ అవిశ్రాంత పోరాటం చేసేందుకు సిద్ధమైన వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి రాజకీయ ప్రవేశంతో ఇక రాజకీయంగానూ తన తండ్రి హత్యలో పాత్రధారులు, సూత్రధారుల పని పట్టేందుకు డిసైడైపోయారు. వివేకా హత్య కేసులో తన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిలతో కలిసి అడుగులు వేసేందుకు రెడీ అయిపోయారు. నేడో రేపో ఆ మరునాడో షర్మిల సమక్షంలో సునీత కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల సోమవారం (జవవరి 28) ఇడుపులపాయ రానున్నారు. ఆమెతో సునీత భేటీ కానున్నారు. న్యాయపోరాటంలో తనకు అండగా నిలిచిన షర్మిలతో కలిసే తన రాజకీయ ప్రయాణం చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల అండతో తన తండ్రి హత్యలో సూత్రధారులు, పాత్రధారులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్న సునీత.. రాజకీయంగా తొలుత వారిని దెబ్బకొట్టాలనీ, న్యాయపోరాటంలో ఎటూ విజయం తనదేననీ ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరి, కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ అవినాష్ పై పోటీకి దిగాలని సునీత భావిస్తున్నట్లు పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ దాదాపు ఖరారయ్యారు. ఈ నేపథ్యంలోనే సునీత కాంగ్రెస్ గూటికి చేరి అదే స్థానం నుంచి బరిలోకి దిగితే.. అవినీష్ కు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.
అజాత శత్రువుగా కడప వాసుల గుర్తింపు పొందిన వైఎస్ వివేకా హత్యలో దోషులు ఎవరన్నది న్యాయస్థానాలు ఇంకా నిర్ధారించలేదు. కానీ.. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులలో వెల్లడైన అంశాల ఆధారంగా ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? చేసింది ఎవరు? చేయించింది ఎవరు అన్న విషయంలో ఒక్క కడప వాసులే కాదు.. అందరికీ ఒక అవగాహన వచ్చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సునీత కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తే అవినాష్ కు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టక మునుపు వరకూ ఆమె ఏపీ అసెంబ్లీ బరిలో దిగుతారా లేదా అన్న అనుమానాలు ఉండేవి. అయితే ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీలో ఉంటారని నిర్ధారణ అయిపోయింది. ఆ తరువాత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు తన అన్న ఎంత మాత్రం కాదని, తానే ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నాననీ కుండబద్దలు కొట్టడంతో ఆమె పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నకు పోటీగా నిలబడతారన్న విషయంలో పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే పులివెందులలో జగన్ పట్ల వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. సొంత నియోజకవర్గంలో జగన్ కు ఎదురౌతున్న నిరసనలు, ఆ నిరసనలకు వెరచి పరదాలు లేకుండా పులివేందులలో కూడా పర్యటించడానికి జగన్ జంకుతుండటాన్ని ప్రస్తావిస్తూ పరిశీలకులు షర్మిల, సునీత ఇరువురూ ఎన్నికల బరిలోకి దిగితే కడప జిల్లాలో వైసీపీకి ఎదురీత తప్పదని చెబుతున్నారు.