వివేకా హత్య కుట్రదారులెవరు?..హస్తిన వేదికగా సునీత ప్రెస్ మీట్
posted on Mar 1, 2024 @ 9:44AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం (మార్చి 1) న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆప్ ఇండియా వేదికగా.. వివేకా హత్య.. కుట్రదారులు ఎవరు?.. అనే అంశంపై ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఆహ్వానం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తండ్రి హత్యపై నర్రెడ్డి సునీత ప్రెస్‌మీట్ ఏర్పాటుపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన నాటి నుంచి ఈ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. బుల్లితెరలో ప్రసారమయ్యే మాంఛి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తోందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.
హత్య జరిగిన రోజు తొలుత.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ.. వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు. దీంతో వివేకా మరణ వార్త ప్రపంచానికి తెలిసింది. అయితే కొద్ది సేపటికే.. ఆయన గుండెపోటుతో మరణించ లేదు.. దారుణ హత్యకు గురయ్యారంటూ.. మీడియాలో వరుస వార్తా కథనాలు వెల్లువెత్తడం.. దానిని సైతం పోలీసులు ధృవీకరించడంతో.. వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారని విషయం ప్రపంచానికి తెలిసింది.
ఇక ఈ హత్య జరిగిన రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి తాపీగా పులివెందుల చేరుకున్న అప్పటి ప్రతిపక్ష నేత జగన్.. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని.. అందులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ.. నర్రెడ్డి సునీత, షర్మిల, వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలోనే ప్రకటించారు. అంతటితో ఆగకుండా వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. ఈ కేసులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు బహిర్గతం అవ్వరని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ కడప జిల్లా వాసులు సునీత హస్తిన వేదికగా ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించడం ఖాయమంటున్నారు.
అప్పట్లో జగన్ నారాసుర రక్త చరిత్ర అంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. సొంత బాబాయ్ హత్య అప్పటి ఎన్నికలలో వైసీపీకి సానుభూతి పవనాలు వీచడానికి కారణమై విజయానికి దోహదపడింది. దరిమిలా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జగన్ పాలనలో.. తన తండ్రి హత్య కేసులో తప్పక న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని అప్పట్లో సునీత వ్యక్తం చేశారు. అయితే.. ఇంతలో వివేకా హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ విపక్ష నేతగా తాను కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం అవ్వగానే జగన్ వెనక్కి తీసుకోవడంతో పాటు.. ఈ హత్య కేసు దర్యాప్తును దాదాపుగా నీరు గార్చేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తన తండ్రి హత్య ఎందుకు జరిగింది.. ఎవరు చేశారు.. దీనిలో ప్రమేయం ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలంటూ.. సోదరుడు ప్లస్ సీఎం జగన్‌ను సునీత పలుమార్లు కోరారు. ఆ క్రమంలో వారి మధ్య చోట చేసుకున్న సంభాషణతో.. సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం.. తన తండ్రి హత్య కేసులో దాగి ఉన్న అన్ని కోణాలు బయటకు రావాలంటే, అందుకు సీబీఐ దర్యాప్తు ఒక్కేటే మార్గమని బావించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దాంతో ఈ కేసు సీబీఐ విచారణలో భాగంగా.. పలువురిని ప్రశ్నించగా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారి.. ఈ హత్యలో ఉన్న పాత్రధారులు... తెర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు వరుసగా సీబీఐకి వివరించడమే కాకుండా... ఈ హత్యకు కోట్లాది రూపాయిల డీల్ కుదిరిందని వెల్లడించండంతో వివేకా హత్య ఇంటి దొంగల పనేననే విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలలో అంటే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డితోపాలు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో తొలిసారి హాజరైనప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యవహరించిన తీరు దగ్గర నుంచి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు, భారతీ పీఏను సైతం కడపకు పిలిపించి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం వరకూ ఒకెత్తు అయితే... ఆ తర్వాత సీబీఐ అధికారులకు స్థానికంగా బెదిరింపులు ఎదురు కావడం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ మరొకెత్తని కడప వాసులు అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. వచ్చిన ప్రతీసారి.. ఈ కేసు దర్యాప్తులో వేగం మందగించిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కడప వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ఆ తర్వాత ఇదే హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలవడం.. ఆ క్రమంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ.. కర్నూలు ఆసుపత్రిలో చేర్చడం.. దీంతో ఆ పరిసరాలకు సీబీఐ అధికారులు వెళ్లలేక పోవడం.. ఆ తర్వాత.. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.. సీబీఐ అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందనే ఓ ప్రచారం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లా వాసులే ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.
మరోవైపు ఇదే వివేకా హత్య కేసులో సీఎం జగన్ సొంత సోదరి వైయస్ షర్మిల.. ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత ఇదే కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. కడప ఎంపి టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందంటూ.. ఓ క్లూను ఆమె బాణంలా వదిలారు. అదీకాక ఆస్తి కోసమే వివేకా హత్య జరిగిందంటూ ఓ వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో, షర్మిల ఆ వాదనను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్నా.. తన ఆస్తులన్నీ ఎప్పుడో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతకు రాసేశారని.. అలా అయితే ఆస్తుల కోసమే ఈ హత్య జరిగి ఉంటే.. ముందు సునీతను కదా హత్య చేయాల్సిందంటూ.. ఓ లాజిక్ జనంలోకి వదిలారు. ఆమె లాజిక్‌తో.. వివేకా హత్యపై ప్రజల్లో ఉన్న అన్ని సందేహాలు దాదాపుగా పటాపంచలు అయిపోయాయని.. ఇంకా చెప్పాలంటే.. వివేక హత్యపై ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చిందని.. దీంతో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు షర్మిల బాసటగా నిలిచినట్లు అయిందనే భావన కడప వాసులలో వ్యక్తం అవుతోంది.
అయితే వివేకా హత్యపై .. అదీ ఢిల్లీ వేదికగా ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత.. ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే.. తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఎక్కడుంది, తన తండ్రి హత్యలో పాత్రధారులు, సూత్రధారులు అరెస్ట్ కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది.. న్యాయస్థానాలు ఆదేశించినా, దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణకు మోకాలడ్డుతున్నది ఎవరు?.. ఈ దేశంలో న్యాయం అనేది సామాన్యులకే కాదు.. కొంత మంది పెద్దవాళ్లు.. అందునా ఒంటరి పోరాటం చేస్తున్న వారికి అందని ద్రాక్షగానే మిగిలి పోతుందా? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. అధికారమనే అందలం ఎక్కిన వారి ఇంటి వసారాలో న్యాయం అనేది గూటిలో రామ చిలకలాగా బందీ అయిపోయిందా? అని కడప జిల్లా వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సునీత నర్రెడ్డి .. ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య .. కుట్రదారులు ఎవరు అని ప్రశ్నిస్తే.. కనీసం ఎన్నికల వేళ అయినా.. ఆమెకు న్యాయం జరుగుతుందా? అని జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది మార్చి 15కు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై అయిదేళ్లు పూర్తి అవుతుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.