యువ సినీ నటి, మోడల్ ఆత్మహత్య
posted on Sep 3, 2014 @ 2:57PM
ముంబైలో సయ్యామ్ ఖన్నా అలియాస్ మోనా ఖన్నా అనే యువ వర్ధమాన సినీ నటి, మోడల్ ఆత్మహత్య చేసుకుంది. మోనా ఖన్నా గత కొంతకాలంగా మోడలింగ్ రంగంలో కొనసాగుతోంది. మోడలింగ్‌లో అవకాశాలు, ఆర్థిక అంశాలూ బాగానే వున్నప్పటికీ ఆమెకు మొదటి నుంచీ సినిమా హీరోయిన్ కావాలనే కోరిక వుండేది. సినిమా హీరోయిన్ కావాలన్న ఉద్దేశంతోనే ఆమె మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత ప్రయత్నిస్తున్నా చిన్నా చితకా వేషాలు తప్ప తాను కోరుకుంటున్న హీరోయిన్ వేషాలు రావడం లేదు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ ఆమెకి సంతోషం కలగడం లేదు. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ తనకు సినిమా హీరోయిన్ అవకాశాలు రావడం లేదని మోనా ఖన్నా బాధపడుతూ వుండేది. ఆదివారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మోనా ఖన్నా ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, సినిమా అవకాశాలు లేని కారణంగానే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు మోనా ఖన్నా తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.