మీకు ఈ అలవాట్లు ఉంటే ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు..!
posted on Sep 8, 2025 @ 12:04PM
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో పెట్టుకునే ఒక లక్ష్యం. అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కానీ చేసే పనిలో విజయం సాధించాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అయితే చాలా మందికి విజయం అనేది మాటల్లో లేదా కలలో మాత్రమే ఉండిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా కొందరు విజయం సాధించలేరు. ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నా చాలా కారణాలు కళ్లముందు కనిపిస్తాయి. అయితే విజయం సాధించాలంటే కష్టపడుతూ ప్రయత్నం చేయడం మాత్రమే కాదు.. కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలని చెబుతున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఎంత కష్టపడినా విజయం దక్కకుండా అడ్డుకునే అలవాట్లు ఏమిటి? వాటిని ఎలా మార్చుకోవాలి?తెలుసుకుంటే..
సోమరితనం..
చాలామంది కష్టపడుతూనే ఉన్నాం కానీ విజయం సాధించలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. అయితే కష్టపడేవారిలో కూడా సోమరితనం ఉంటుంది. సాధారణంగా కష్టపడ్డాం అని చెప్పేవారు కష్టపడిన సమయం గురించి పెద్దగా పట్టించుకోరు. విజయం సాధించాలంటే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అంతేకానీ ప్రయత్నం చేయాల్సిన సమయంలో చేయకుండా ఆ తరువాత ఎంత కష్టపడినా ఫలితం అందదు.
కోపం..
తన కోపమే తన శత్రువు అని అన్నారు పెద్దలు. కోపం విధ్వంసానికి దారితీస్తుంది. కోపం వల్ల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు, ఓటమిని తీసుకోలేని తనం.. ఇట్లా చాలా మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. కోపం మనిషిలో విచక్షణను చంపేస్తుంది. అందుకే కోపం ఉన్నవాడికి విజయం ఆమడ దూరంలో ఉంటుంది.
అహంకారం..
ఒక ఖచ్చితమైన మనిషికి ఉండకూడని గుణం అహంకారం. నేనే కరెక్ట్, నేను చెప్పిందే సబబు, ఇది ఇలానే జరగాలి అనుకునే వ్యక్తి విజయం సాధించే దిశలో ఎదురయ్యే చాలా విషయాలను ఓర్పుగా అంగీకరించలేడు. ఎప్పుడైతే తన నిర్ణయాలను తప్ప దేన్నీ అంగీకరించలేని స్థితిలో ఉంటారో..అప్పుడు వ్యక్తి ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు.
అబద్దాలు చెప్పడం..
అవసరానికి అబద్దం చెప్పడం తప్పేం కాదు.. అని చాలా మంది అనుకుంటారు. ఈ కాలంలో అబద్దాలు చెప్పకుండా అస్సలు ఒక పని అయినా జరుగుతుందా అనుకునేవారు కూడా ఉంటారు. అయితే అబద్దాలు చెప్పడం వ్యక్తి జీవితంలో నెగిటివ్ దృక్పథాన్ని క్రమంగా పెంచుతుంది. మనిషిలో నెగెటివ్ కోణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయం సాధించాలన్నా ఆ నెగెటివ్ కోణం అడ్డు పడుతూ ఉంటుంది.
పైన చెప్పుకున్న అలవాట్లను వదిలిపెడితే విజయం సాధించడం సాధ్యం అవుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా విజయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది.
- రూపశ్రీ