శ్రీశైలంలో మూడో రోజు చంద్రఘంటా దుర్గ గా అమ్మవారు

శ్రీశైలంలో   శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంటా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు చంద్రవంక ఆకారంలో ఉండే గంటను శిరస్సున ధరించి, శివునితో కలయికను సూచిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఇక రెండో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 23)  బ్రహ్మచారిణి అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలం కారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో, అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూరవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు,బాజా బజంత్రీలు,కేరళ చండీ మేళం,కొమ్ము కోయ నృత్యం,స్వాగత నృత్యం,రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాల,చెంచు గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఆలయంలోపలి నుంచి భాజా భజంత్రీలు బ్యాండు వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా,  కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

  వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న  వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ  సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్‌ ఇంజినీర్‌, పలు విభాగాల అధికారులు టీటీడీ ఛైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ క్యూలైన్‌ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను వారు పరిశీలించారు.  వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్‌కు అధికారులు వివరించారు.  క్యూలైన్ ఎంట్రీ వద్ద భక్తులకు కల్పించి సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు

బిక్కి కృష్ణ రాసిన "సాయితత్వం - లీలారహస్యం" పుస్తకావిష్కరణ

  ప్రముఖ కవి, తత్వవేత్త బిక్కి కృష్ణ రాసిన"సాయితత్వం-లీలారహస్యం"అన్న గ్రంథాన్ని విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం. నరసింహప్ప హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. శ్రీ భం సాయి సేవాట్రస్ ఆధ్వంర్యంలో ప్రముఖ కవి డా. వి. డి. రాజగోపాల్  అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో కవయిత్రులు డా. రాధా కుసుమ,పద్మశ్రీలతలు పుస్తకాన్ని సమీక్షించారు. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశోధించి బిక్కి కృష్ణ సాధికారికంగా సాయితత్వం గ్రంథాన్ని రచించారన్నారు. ఈ సమావేశంలో యలవర్తి ధనలక్ష్మి,మారెళ్ళ రాజరాజేశ్వరి, కోగంటి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

మెస్సీని వెనక్కి నెట్టి రొనాల్డో అరుదైన రికార్డు

  ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్‌ నస్ర్‌ తరఫున అల్‌ అఖ్‌డౌద్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. రెండు గోల్స్‌ సాధించిన రొనాల్డో.. 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో 40 గోల్స్‌ పూర్తి చేశాడు. ఈ క్రమంలో లియోనెల్‌ మెస్సీని వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే 14 సార్లు ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌదీ ప్రో లీగ్‌లో  అల్‌ నస్ర్‌ 3-0తో విజయం సాధించింది. సౌదీ ప్రో లీగ్ చరిత్రలోనే వరుసగా పదో మ్యాచులు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్ నస్ర్ రికార్డు సృష్టించింది.  రొనాల్డో 31వ నిమిషంలో ఓ గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. చివరి నిమిషాల్లో జోవో ఫెలిక్స్‌ మరో గోల్‌ జోడించాడు. బాక్స్‌లో చురుకైన కదలికలతో రొనాల్డో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ ఏడాది రొనాల్డో క్లబ్‌ స్థాయిలో 32 గోల్స్‌, పోర్చుగల్‌ జాతీయ జట్టుకు 8 గోల్స్‌ చేశాడు. అదనంగా నాలుగు అసిస్టులు కూడా అందించాడు. మొత్తంగా ఇది అతని కెరీర్‌లో 14 సార్లు ఒకే ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ వేశాడు. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సిని అధిగమించాడు. మెస్సి ఈ ఘనతను 13 సార్లు మాత్రమే ఒకే సంవత్సరంలో 40 సార్లు గోల్స్ సాధించగలిగాడు. రొనాల్డో, మెస్సిల తర్వాత రాబర్ట్‌ లెవాండోవ్‌స్కీ (9 సార్లు), ఎంబాపే, హ్యారీ కేన్‌, హాలాండ్‌ (తలో 5 సార్లు) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. నాలుగు సార్లు (2011–14) ఏడాదిలో 60కిపైగా గోల్స్‌ చేసిన ఘనత కూడా రొనాల్డోదే.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైద్య  నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురాపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. పోచంపల్లి శ్రీధర్‌రావు (మాస్‌ కమ్యూనికేషన్‌)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.  రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగనున్నారు.   డాక్టర్ మంతెన సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. 

హైదరాబాద్‌లో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా

  హైదరాబాద్‌లో చైనా మాంజా వాడకం వల్ల ఏర్పడుతున్న ప్రాణాంతక ప్రమాదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. చైనా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో ఒక మైనర్ బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో బాలుడి గొంతు పాక్షికంగా తెగిపోగా, వైద్యులు అత్యవసరంగా 22 కుట్లు వేసి ప్రాణాలను కాపాడారు. తీవ్ర రక్తస్రావం, ప్రాణాంతక పరిస్థితుల్లో చికిత్స పొందిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  అయితే, హెచ్చరికలు మరియు చర్యలు కొనసాగుతు న్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమ తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నా బిడ్డ మెడకు ప్రమాదం జరిగింది. రేపు అది మీది కావచ్చు. మీ పిల్లలు కూడా ఇదే నగరంలో, ఇదే రోడ్లపై నడుస్తున్నారు. చైనా మాంజాను కొనుగోలు చేసే వారికీ బాధ్యత ఉందని, అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెంచుతున్నది వినియోగదారులేనని వారు స్పష్టం చేశారు.“కేవలం వినోదం కోసం అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మానవ ప్రాణాలకంటే ఆ వినోదం విలువైనదా?” అని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ వ్యాపారం హరామ్ మరియు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, పౌరులు ఎవరూ ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. మీరు నిజంగా బాధ్యతా యుతమైన తల్లిదండ్రుల పిల్లలైతే, చైనీస్ మాంజాను కొనకండి. నగరంలో చైనా మాంజాతో ఎగిరే గాలిపటం పిల్లల ప్రాణాలు తీస్తోంది” అని బాలుడి తల్లిదండ్రులు హెచ్చరించారు.  నగర పరిధిలో చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి తల్లిదండ్రులు వినయ పూర్వకంగా అభ్యర్థించారు. గాలిపటాలు ఎగురవేయ డాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితం చేయాలని సూచించారు.  చైనీస్ మాంజాతో జరిగే ప్రాణనష్టాలను అడ్డుకోవాలంటే  సహనం, కఠిన అమలు మరియు ప్రజల బాధ్యత అత్యవస రమని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్ముతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేల బహుమతి ఇస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మితే పోలీసులతో కేసులు పెట్టిస్తాని దానం హెచ్చరించారు. దయచేసి ఎవరూ చైనా మాంజా విక్రయించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు  

అమెరికాలో రోడ్డు ప్రమాదం....ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

  అమెరికాలో మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వ రరావు కూతురు మేఘన, అలాగే ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఉన్నత చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన ఈ యువతులు ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మేఘన, భావనతో పాటు మొత్తం ఎనిమిది మంది స్నేహితులు కాలిఫోర్నియాలో టూర్‌కు వెళ్లారు. రెండు కార్లలో ప్రయాణించిన వారు టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాలిఫోర్నియా లోని అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో మేఘన, భావన అక్కడి కక్కడే మృతి చెందారు. ఇతరులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఎంఎస్  పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు తోడుగా నిలవాలన్న ఆశలతో అమెరికాకు వెళ్లిన మేఘన, భావనల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగియడం అందరినీ కలిచివేస్తోంది.  రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే స్వస్థలాల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన, భావన చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ చూపా రని, ఉన్నత ఆశయాలతో విదేశాలకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా లో రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో తెలుగు విద్యార్థులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతుండడం తో తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ ప్రమాదం మరోసారి తెలుగు సమాజాన్ని కలచివేసింది. మృతుల మృతదేహాలను భారత్‌కు తరలించే ప్రక్రియపై కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల అకాల మరణం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.  

ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్రెడిట్ కార్డు ఏదో తెలుసా?

మీ దగ్గర ఆ క్రెడిట్ కార్డు ఉంటే ఏకంగా విమానాన్ని కూడా కొనుగోలు చేసేయొచ్చు. మారిన జీవనశైలి లో రోజువారీ నగదు లావాదేవీలకు కరెన్సీకి బదులుగా క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. షాపింగ్ చేసిన వెంటనే జేబులోని డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. తరువాత బిల్ రూపంలో చెల్లించే సౌకర్యం ఉండటంతో క్రిడిట్ కార్డులకు గిరాకీ బాగా పెరిగిపోయింది.  అదే డిబిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఆ సొమ్ము  వెంటనే   మీ బ్యాంక్ ఖాతాలోంచి తగ్గిపోతుంది.  అదే క్రెడిట్ కార్డు అయితే.. వెంటనే మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము ఖర్చై పోదు. క్రిడిట్ కార్డు ఉపయోగిస్తే.. సదరు సొమ్మును నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లించే సావకాశం ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుకు ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఆ కార్డు హోల్డర్ ఆదాయం, బ్యాంకు ఖాతా స్థితి, అతడి క్రెడిట్ హిస్టరీని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి. కానీ ఈ సాధారణ నియమాలకు పూర్తి భిన్నంగా  , ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్. దీకికి  అమెక్స్ బ్లాక్ కార్డ్' అని పిలుస్తారు.  క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో ఇది నిజంగా రాజులాంటిదే.  ఈ కార్డు కలిగి ఉండటం సంపద, ప్రతిష్ఠ,  ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ కార్డు  ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితి ఉండదు. సాధారణ కార్డుల్లా  లిమిట్ అనే భావనే ఇందులో ఉండదు. మీరు ఈ కార్డుతో ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయవచ్చు, విలువైన ఆభరణాలు లేదా వజ్రాలు తీసుకోవచ్చు, అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జెట్‌లను కూడా కొనుగోలు చేసేయవచ్చు.   అంతేకాదు, ఈ కార్డు టైటానియం మెటల్‌తో తయారవ్వడం వల్ల, ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా, ప్రీమియం రూపంలో ఉంటుంది. అయితే ఈ అపరిమిత శక్తిని ఇచ్చే కార్డును పొందడం మాత్రం చాలా కష్టం. ఇది సాధారణంగా బ్యాంకులో దరఖాస్తు చేసి పొందే కార్డు కాదు. అమెక్స్ బ్లాక్ కార్డ్ పూర్తిగా ఆహ్వానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎవరు ఈ కార్డుకు అర్హులు అనే విషయాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ స్వయంగా నిర్ణయిస్తుంది. సెంచూరియన్ కార్డు 1999లో అధికారికంగా ప్రారంభమైంది. అయితే దీని గురించిన కథలు, వదంతులు  1980ల నుంచే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం దీనిని ఒక పుక్కిటి పురాణ కథలాగో, అభూత కల్పనలాగో భావించేవారు. అయితే   బ్రూనై సుల్తాన్ లేదా అమెక్స్ సీఈఓ లాంటి కొద్దిమంది అతి సంపన్నుల వద్ద మాత్రమే ఈ కార్డు ఉందని చెప్పుకునేవారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు అరుదైన క్రెడిట్ కార్డులలో ఒకటిగా కొనసాగుతోంది. అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య లక్షకు తక్కువగా ఉంటుంది. అమెరికాలో మాత్రమే దాదాపు 20,000 మంది ఈ కార్డును ఉపయోగిస్తున్నారని అంచనా. దీనిని బట్టే దీనిని పొందడం అంత వీజీ కాదని అర్ధం చేసుకోవచ్చు.   ఇలాంటి అరుదైన క్రెడిట్ కార్డు హోల్డర్ల సంఖ్య భారత దేశంలో అతి స్వల్పం మాత్రమే. అందుబాటులో ఉన్న నివేదికల మేరకు దేశంలో కేవలం వంద మంది మాత్రమే ఈ కార్డు హోల్డర్లు ఉన్నారు.  ఈ కార్డును పొందేందుకు ఎలాంటి సాధారణ అప్లికేషన్ ప్రక్రియ ఉండదు. అయితే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వద్ద మీ ఖర్చుల చరిత్ర బలంగా ఉండాలి. సాధారణంగా  అమెక్స్ ప్లాటినం కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం 3.5 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకు  ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే..  మీ క్రెడిట్ స్కోరు అత్యుత్తమంగా ఉండాలి, మీ నికర ఆస్తి విలువ బాగా ఎక్కువగా ఉండాలి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో మీకు దీర్ఘకాలిక సంబంధం ఉండాలి. కొన్నిసార్లు అమెక్స్ వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ ఇన్వైట్ ఫారమ్‌ను పూరించే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం పూర్తిగా అమెక్స్ చేతుల్లోనే ఉంటుంది. ఈ కార్డు  బలం ఎటువంటి క్రెడిట్ పరిమితి  లేకపోవడమే.  అంటే   చెల్లింపు చరిత్ర బాగున్నంత వరకు, ఈ కార్డు హోల్డర్లు వారి వారి అవసరాలకు   అనుగుణంగా ఎంత ఖర్చు చేసినా అమెక్స్ అనుమతిస్తుంది. అయితే  ఖర్చుల విధానం, ఆదాయం మరియు ఆర్థిక ప్రవర్తన ఆధారంగా, అమెక్స్ ప్రతి నెలా అంతర్గతంగా ఒక డైనమిక్ లిమిట్‌ను నిర్ణయిస్తుంది. అందుకే ప్రపంచంలోని అతి ధనవంతులు ఈ కార్డుతో ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలు మరియు విలాసవంతమైన ఇళ్లను కూడా కొనుగోలు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ కారణంగానే అమెక్స్ బ్లాక్ కార్డు క్రెడిట్ కార్డుల ప్రపంచంలో ఒక లెజెండ్‌గా నిలిచింది.

సీఎం చంద్రబాబు ముందు.. మంత్రి రాంప్రసాద్‌ కన్నీటి పర్యంతం

  అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాకి మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాయచోటి అభివృద్ధిని తానే ప్రత్యేకంగా చూసుకుంటానని, పట్టణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోనని  సీఎం, మంత్రికి భరోసా ఇచ్చారు.  సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  క్యాబినెట్‌లో 24 అంశాలను ఆమోదించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు మంత్రి అనగాని వెల్లడించారు.  

డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడిన ఐబొమ్మ రవి!

సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ కేసులో  రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఐబొమ్మ రవి కేవలం పైరసీకే పరిమితం కాలేదనీ.  ఇతరుల గుర్తింపు పత్రాలను సైతం దొంగిలించి భారీ అక్రమాలకు పాల్పడిన వైనం వెలుగు చూసింది. గతంలో పోలీసుల ముందు రవి ఇచ్చిన వాంగ్మూలంలో... ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అనీ, ఐబొమ్మ నిర్వహణలో అతడికి కూడా పాత్ర ఉందని చెప్పాడు. అయితే విచారణలో   రవి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తేలింది. వాస్తవానికి ప్రహ్లాద్‌కు ఏమాత్రం తెలియకుండానే అతడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అలా దొంగిలించిన పత్రాలతో ప్రహ్లాద్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంతో పాటు అతని ఐడెంటిటీని వెబ్‌సైట్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ కోణంలో నిజాలను వెలికితీసేందుకు బెంగళూరులో నివసిస్తున్న ప్రహ్లాద్‌ను ప్రత్యేకంగా విచారణకు పిలిపించారు. రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టగా, అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు రవి ఎవరో తెలియదని, తామిద్దరం ఎప్పుడూ రూమ్‌మేట్స్‌ కాదనీ  ప్రహ్లాద్ స్పష్టంగా చెప్పాడు. తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వాడుతున్నారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానని పోలీసులకు వివరించాడు. తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశాడు. ఈ పరిణామాలతో రవి చేసిన నేరాల జాబితా మరింత పెద్దదిగా మారుతోంది. పైరసీతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్‌, ఫోర్జరీ, మోసాలు వంటి తీవ్రమైన ఆరోపణలు అతడిపై నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇంకెంతమంది అమాయకుల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయ్యాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.