శ్రీనగర్ నిట్.. తెలుగు విద్యార్ధుల కష్టాలు.. ఉండలేకపోతున్నాం..
posted on Apr 7, 2016 @ 11:41AM
టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ అయిపోయింది. వెస్టిండీస్ కప్ గెలిచింది. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిన నేపథ్యంలో మొదలైన అల్లర్లకు మాత్రం ఇంకా బ్రేక్ పడలేదు. ఈ గొడవలు కాస్త శ్రీనగర్ నిట్ వరకూ చేరారు. అయితే అల్లర్లో అందరి సంగతేమో కానీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు మాత్రం అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే.. టీ 20 వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే క్యాంపస్లో పాక్ జెండాలతో.. భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక విద్యార్దులకు.. స్థానికేతర విద్యార్ధులకు మధ్య ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలతో క్యాంపస్ అట్టుడికిపోవడంతో గత శుక్రవారం క్యాంపస్ ను మూసేశారు. తిరిగి మంగళవారం తెరిచారు. అయినా, ఉద్రిక్తతలు చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే స్థానికేతర విద్యార్థులు మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశారు. క్యాంప్‌సలోని వాతావరణం తమను తీవ్రంగా భయపెడుతున్నదని, తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అనుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు స్వస్థలాలకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున వారిపై దాడి చేసి.. లాఠీఛార్జ్ కూడా చేయడంతో దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి.
మరోవైపు శ్రీనగర్ లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కరువైందని ఆరోపణలు వెల్లువెత్తాయి.శ్రీనగర్ నిట్ క్యాంపస్‌లో స్థానికేతర విద్యార్థులపై లాఠీచార్జ్‌పై కేంద్రం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరపాలని జమ్మూకశ్మీర్ సీఎంకు కేంద్ర హోంమంత్రి సూచించారు. నిట్ క్యాంపస్‌లో భారీగా బలగాలను మోహరించారు. శ్రీనగర్ నిట్ క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అంతేకాదు పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించారు. కాగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నాయి.